రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన బీటీపీఎస్ ఉద్యోగి మరో ఆరుగురికి తన అవయవాలు దానం చేసి వారి ప్రాణాలు నిలిపారు. ములుగు జిల్లాకు చెందిన కంజుల అనిల్‌కుమార్(45) భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎస్) జూనియర్ ప్లాంట్ అటెండెంట్(జేపీఏ)గా పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నారు. ఈ నెల 11న పాల్వంచకు వచ్చి తిరిగి వెళ్తుండగా మణుగూరు సమీపంలోని తొగ్గూడెం వద్ద ఆగి ఉన్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ఘటనలో శిరస్త్రాణం ఎగిరిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే మణుగూరు ఆసుపత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి ఖమ్మం తీసుకెళ్లారు. అక్కడి నుంచి మలక్‌పేట యశోదకు తరలించారు. చికిత్స అందిస్తుండగా 17న అనిల్‌కుమార్ బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా అవయవాలు దానమిచ్చేందుకు అంగీకరించారు. తెలంగాణ ప్రభుత్వం పరిధిలోని ‘జీవన్‌దాన్’కు సమాచారం అందించారు.
అనిల్ గుండెను ‘జీవన్‌దాన్’ ద్వారా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి ప్రత్యేక కాన్వాయ్‌తో బేగంపేట విమానాశ్రయానికి చేర్చి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి తరలించారు. అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి అమర్చారు. ఇదంతా కేవలం 4 గంటల వ్యవధిలో జరిగిపోయింది. అతని కళ్లను హైదరాబాద్‌లోని ఎల్.వి.ప్రసాద్ ఆసుపత్రికి, కిడ్నీలను మలక్‌పేట యశోదా, బంజారాహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి, కాలేయం, ఊపిరితిత్తులను సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి పంపించారు. అనిల్‌కుమార్‌కు భార్య జ్యోతి, ఇద్దరు కుమారులు హృషికేశ్, భగీరథ్ ఉన్నారు. అనిల్‌కుమార్ మృతదేహానికి ములుగులో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అనిల్ నుంచి సేకరించిన గుండె, కిడ్నీలు, కాలేయం, నేత్రాలు, ఊపిరితిత్తులు.. ఇప్పుడు 6 మందికి కొత్త జీవితాన్ని ఇచ్చాయి. అనిల్ భౌతికంగా తమతో లేకపోయినా... మరో ఆరుగురిలో తాను బతికే ఉంటాడంటూ కుటుంబసభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి: ఒకడిగా మరణించి.. నలుగురిలో జీవిస్తున్నాడు...