నాలుగు ఎకరాల స్థలంలో రూ.8 కోట్లతో నూతనంగా చేపడుతున్న గోదాము నిర్మాణ పనులకు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపి వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంకుస్థాపన చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని డి.పోచంపల్లి వద్ద గోదాము నిర్మించనున్నారు.
రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహకార సంఘాలు తోడ్పాటును అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు పంట పెట్టుబడికి ఇబ్బందులు రాకుండా ఏడాదిలో రెండు పంటలకు అవసరమైన రుణాలు, విత్తనాలు, ఎరువులను అందజేస్తున్నారని వెల్లడించారు . రైతులకు సకాలంలో పంటరుణాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గోదాముల్లో 2500 మెట్రిక్ టన్నుల ఎరువులు, ధాన్యం నిల్వ ఉంచేలా నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.