Mallareddy Trees Issue: రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా నాటిన చెట్లను తొలగించి మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలం ఆలియబాద్ చౌరస్తాలో ఇటీవల మంత్రి నూతనంగా సీఎంఆర్ కన్వెన్షన్ హాల్‌ను ప్రారంభించారు. అయితే తన కన్వెన్షన్ హాల్ ముందు నాటిన చెట్లు పెద్దవిగా కావడం వల్ల తన హాల్ కనబడడం లేదంటూ సుమారు 65 చెట్లలో కొన్ని చెట్లను వేర్లతో సహా పెకిలించేశారు. మరి కొన్నింటి చెట్ల కొమ్మలను నరికేయించారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఫారెస్ట్ రేంజ్ అధికారి విజయ్ భాస్కర్ నేతృత్వంలోని బృందం ఘటన స్థలిని పరిశీలించింది. కేవలం చెట్ల కొమ్మలు నరికేసినట్లు ఆనవాళ్లు కనబడుతున్నాయని... కానీ వేర్లతో సహా చెట్లను పీకిన ఆనవాళ్లు కోసం దర్యాప్తు చేస్తున్నామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెట్లు నరికిన ప్రాంతాన్ని మేడ్చల్ కాంగ్రెస్ నాయకుడు హరివర్ధన్ రెడ్డి పరిశీలించారు. మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి మల్లారెడ్డి చెట్లను నరికివేయించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: యాదాద్రిలో భక్తుల అవస్థలు.. లక్ష్మీ పుష్కరిణిలో నీళ్లు లేక ఇక్కట్లు