KTR Medchal Tour : మేడ్చల్ జిల్లాలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పేట్‌బషీరాబాద్‌లో పర్యటించిన మంత్రి.. ఫాక్స్‌సాగర్ వద్ద అభివృద్ధి పనులు ప్రారంభించారు. కోల్ కాలువ, కెమికల్ కాలువ, తూము కాలువ అభివృద్ధి పనులను ప్రారభించారు. 95 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శివారు ప్రాంతాల్లో 2 వేల కోట్లతో మంచినీటి పనులు చేపట్టామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఓఆర్ఆర్ పరిధిలోని కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు మంచినీరు అందిస్తున్నామని తెలిపారు.
ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం జీవోలు..
Minister KTR in Medchal : నాగార్జునసాగర్ నుంచి నగరానికి నీటి తరలింపు కోసం మరో పైపులైన్ చేపడుతున్నామని.. ఇప్పటికే 600 మిలియన్ గ్యాలన్లు నీటిని అందిస్తున్నామని మంత్రి చెప్పారు. నగరంలో నీటిశుద్ధీకరణ కోసం 3 వేల కోట్లతో సీవరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 27 కోట్ల 31 లక్షలతో ఫాక్స్‌సాగర్, వెన్నెలగడ్డ చెరువు, మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాలు.. గాజులరామరంలో 11 కోట్లతో ఆక్సిజన్ పార్కు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు లేకపోయినా నిరంతరం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేటీఆర్ వివరించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం జీవో 58, 59ని మళ్లీ తీసుకొస్తామని ప్రకటించారు.
ఎంపీలు పోరాడాలి..
KTR on GO 58, 59 : హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రాన్ని 7 వేల8 వందల కోట్లు అడిగామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం బడ్జెట్ సమావేశంలో తెరాస ఎంపీలు పోరాడాలని సూచించారు. రక్షణశాఖ స్థలం ఇవ్వాలని ఏడున్నరేళ్లుగా కేంద్రాన్ని అడుగుతున్నా పట్టించుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు.
బ్యాట్ అయినా.. బాల్ అయినా.. అదరగొట్టాల్సిందే..
KTR Quthbullapur Visit : అంతకుముందు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి .. రూ.138 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బాచుపల్లి- మల్లంపల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గాజులరామారం పరిధిలో అర్బన్ ఫారెస్ట్ పార్క్, స్పోర్ట్స్ పార్క్‌ను ప్రారంభించారు. అనంతరం యువకులతో కలిసి సరదాగా క్రికెట్, బాస్కెట్ బాల్ ఆడారు. చింతల్‌లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్‌కు మంత్రి ప్రారంభోత్సవం చేశారు.
నగరశివార్లలో మౌలిక వసతులు
KTR kuthbullapur Visit : 'గతంలో వారానికోసారి మంచినీరు వచ్చేది. ఇప్పుడు నగరవాసులకు ప్రతిరోజూ తాగునీరు అందిస్తున్నాం. హైదరాబాద్ నగరం రోజురోజుకు చాలా విస్తరిస్తోంది. వచ్చే 30 ఏళ్లలో నగరం ఇంకా కిలోమీటర్ల కొద్దీ విస్తరిస్తుంది. నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుని శివార్లలో మౌలిక వసతులు పెంచుతున్నాం. శివారులోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలుగా మారాయి.'
- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!