లాక్డౌన్ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు... స్కూల్ యాజమాన్యాలు జీతాలు చెల్లించకపోవడం సరైన పద్ధతి కాదని శేరిలింగంపల్లి భాజపా నేతలు అన్నారు. వెంటనే ఉపాధ్యాయలుకు జీతాలు చెల్లించడంతోపాటు ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు టీచర్లు, కమలం నేతలు కలిసి శుక్రవారం కూకట్‌పల్లి మండల విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు.
ప్రైవేటు పాఠశాలలో పని చేసే వారు అనేక మంది పేద, మధ్య తరగతి వారేనని.. జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భాజపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 10శాతం పాఠశాలల్లో మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగాల నుంచి తొలగించిన వారి తిరిగి తీసుకోవాలని ఆదేశించాలని కోరారు.