Police Solved Boy Kidnapping Case in Malkajgiri : మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం కిడ్నాప్‌నకు గురైన హర్షవర్దన్‌ను రాచకొండ ఎస్‌వోటీ, మల్కాజిగిరి, జనగామ జిల్లా పోలీసుల సమన్వయం, స్థానికుల సహకారంతో రక్షించారు. మైనర్ సహా నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు. మల్కాజిగిరి డీసీపీ జానకి ధరావత్, ఎస్‌వోటీ డీసీపీ గిరిధర్, మల్కాజిగిరి ఏసీపీ నరేశ్‌రెడ్డి, సీఐ రవికుమార్, రాములుతో కలిసి నేరేడ్‌మెట్‌లోని కమిషనర్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
Hyderabad Police Solves Malkajgiri Boy Kidnap Case : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన రూపినేని శ్రీనివాస్.. మల్కాజిగిరిలోని సప్తగిరి కాలనీలో నివాసముంటున్నారు. బిల్డర్‌గా స్థిరపడ్డ ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు హర్షవర్దన్ సంతానం. శ్రీనివాస్ ఇంటి పక్కనుండే అన్నదమ్ములు సుంకేసుల శివ, సుంకేసుల రవి షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తుంటారు. ఇటీవల నష్టాలు రావడంతో రూ.4 లక్షల అప్పు చేశారు. దీన్ని తీర్చేందుకు హర్షవర్దన్‌ను కిడ్నాప్ చేసి రూ.2 కోట్లు వసూలు చేయాలని పథకం వేశారు. చెరో రూ.20 లక్షల చొప్పున ఇస్తామంటూ తమ స్నేహితులు, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వాసి పసిక మహిపాల్, కటుకోరి దిలీప్‌లను, ఇటీవల ఇంటర్ పూర్తి చేసిన బాలుడిని తమ బృందంలో చేర్చుకున్నారు. ఈ నెల 15న సాయంత్రం 5 గంటలకు క్రికెట్ మైదానంలోకి వెళ్లిన హర్షవర్దన్‌ను కొత్త బాల్ కొనిస్తామని చెప్పి.. బలవంతంగా కారులో ఎక్కించుకొని వరంగల్ వైపు వెళ్లారు. ఇంటర్ పూర్తయిన విద్యార్థిని తార్నాకలో దింపేశారు.
Malkajgiri Boy Kidnap Case : బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు 15న రాత్రి 9 గంటలకు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఒకరైన రవి అదే రోజు రాత్రి మల్కాజిగిరికి తిరిగొచ్చాడు. తల్లిదండ్రులతో కలిసి బాలుడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు నటించాడు. బాలుడితో నిందితులు ఘట్కేసర్, కేసముద్రం, నర్సింహులుపేట, పాలకుర్తిలకు వెళ్లారు. తాముండే ప్రాంతం తెలియకుండా వీవోఐపీ ద్వారా హర్షవర్దన్ తండ్రికి ఫోన్ చేసి, రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Boy Kidnap in Malkajgiri : నిందితుల చర్యలతో రంగంలోకి దిగిన మల్కాజిగిరి ఎస్‌వోటీ, రాచకొండ సైబర్‌క్రైమ్ బృందాలు వీవోఐపీ కాల్ గుట్టు పట్టేసి, గాలింపు చేపట్టారు. మరోవైపు, రవి ఇక్కడి సమాచారాన్ని తన ముఠాకు చేరవేశాడు. హర్షవర్దన్ తండ్రికి శివ ఫోన్ చేసి పోలీసు కేసు వెనక్కి తీసుకోవాలని, లేదంటే బాలుడిని హతమారుస్తామని హెచ్చరించాడు. దీంతో కేసు వెనక్కి తీసుకున్నట్లు ఒక పత్రాన్ని శివకు వాట్సప్ ద్వారా పంపించారు. దాన్ని ధ్రువీకరించుకోడానికి రవికి శివ పంపాడు. శివ ఫోన్ నంబరు సందేశాల్ని పసిగట్టిన పోలీసులు శనివారం తెల్లవారుజామున రవిని అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితులు జనగామ జిల్లా పాలకుర్తి వైపు వెళ్తున్నట్లు గుర్తించి స్థానికుల సాయంతో బాలుడిని రక్షించారు. ప్రధాన నిందితుడు శివ శుక్రవారమే హర్షవర్దన్‌ను మిగతా ఇద్దరికి అప్పగించి కడపకు వెళ్లిపోయాడు.
ఇవీ చదవండి: