మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెస్ట్ వెంకటాపురంలో మెగా వెస్ట్ వెంకటాపురం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు.. అల్వాల్ సర్కిల్‌కు చెందిన కార్పొరేటర్లు సబిత అనిల్ కిషోర్, శాంతి శ్రీనివాస్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు. అనంతరం కాలనీల సమస్యలపై వారికి వినతి పత్రం అందజేశారు. లోతుకుంట నుంచి వెస్ట్ వెంకటాపురం వరకు రోడ్డు వేయాలని, కల్వర్టు పనులు, చిన్న రాయలు చెరువు నుంచి వచ్చే నాలాను అభివృద్ధి చేయాలని కోరారు. అంతర్గత రోడ్లు బాగు చేయడంతో పాటు వారాంతపు మార్కెట్‌ను రహదారిపై కాకుండా గల్లీలలో పెట్టుకునే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.
కాలనీలలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగే విధంగా సిబ్బందిని ఆదేశించాలని.. రోడ్డుపైన నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇద్దరు కార్పొరేటర్లు వెస్ట్ వెంకటాపురంనకు చెందుతారని అందుకే ఇద్దరికీ కలిపి విన్నవించుకున్నామని తెలిపారు. అసోసియేషన్ సభ్యుల ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్లు.. సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: ప్రైవేటుకు దీటుగా సేవలు... కోతల్లేని ప్రసవాలు