మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్, మేడిపల్లి, రామంతాపూర్, ఘట్‌కేసర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, పోచారం తదితర ప్రాంతాల్లో రోజుకో కొత్త కాలనీ ఏర్పాటవుతోంది. కానీ కాలనీల్లో సరైన వసతులు లేకపోవడం వల్ల వర్షాకాలంలో అక్కడ ఉండేవారికి అవస్థలు తప్పడం లేదు. వర్షం పడిందంటే చాలు.. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై నీరు చేరి రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ వరద పోరును పడలేక కొందరైతే తమ తమ ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు.
ఎన్నో ఆశలతో కొత్త ఇల్లు కట్టుకుంటే.. వర్షం వచ్చిందంటే చాలు.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోందని ఆయా కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం తమ సమస్యకు పరిష్కారం చూపడం లేదని వాపోతున్నారు. ఎన్నికల సమయంలోనే తమ కాలనీలకు వస్తారని.. ఆ తర్వాత తమవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి...
మూసీ కాలువలను ఆనుకొని లే-అవుట్లను తయారు చేసి కొందరు.. కబ్జా చేసి ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్మేస్తున్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండానే చేతులు దులిపేసుకుంటున్నారు. ఫలితంగా కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో సరైన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేక వరద నీరు కాలనీలను ముంచెత్తుతోంది.
ఇదీ చూడండి: RAIN ALERT: బంగాళాఖాతంలో అల్పపీడనం.. బీ అలర్ట్.. భారీ వర్షాలున్నాయ్!!