జీవిత చరమాంకంలో ప్రశాంతంగా ఉండనిస్తారనుకున్న ఆ కన్నతల్లి ఆశలు ఆవిరయ్యాయి. జమ చేసుకున్న డబ్బులు ఇవ్వాలంటూ చిన్న కుమారుడు తరచూ సతాయించడంతో ఆ తల్లి పోలీసులను ఆశ్రయించిన కన్నీటి గాథ ఇది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కూచారం గ్రామానికి చెందిన బోయిని రామలింగమ్మ(70), గణేశ్ భార్యాభర్తలు.
వేధింపులు భరించలేక..
భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందడంతో ఆమె ఇద్దరు కొడుకులకు ఆస్తి సమానంగా ఇచ్చారు. పెద్ద కుమారుడు భిక్షపతి కొంతకాలం క్రితం చనిపోయాడు. రామలింగమ్మ వద్ద ఉన్న రూ.1.20 లక్షలను పెద్ద కుమారుడి భార్య, సంతానం అడిగి తీసుకున్నారు. చిన్న కొడుకు నర్సింలు వద్ద వృద్ధురాలు ఉంటోంది. మేడ్చల్‌లోని ఓ వ్యాపారి వద్ద రామలింగమ్మ రూ.లక్ష చిట్టీ వేస్తోంది. ఆ డబ్బులు తనకు ఇవ్వాలని చిన్న కుమారుడు తరచూ వేధిస్తున్నాడని ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. వేధింపులు భరించలేక మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌కు ఆటోలో వచ్చి ఎస్సై రాజుగౌడ్‌కు గోడు వెళ్లబోసుకున్నారు.
అక్కడే పడుకున్న వృద్ధురాలు..
కొడుకును పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి, సరిగా చూసుకొమ్మని చెబుతానని ఎస్సై హామీ ఇచ్చారు. ఎండ ఎక్కువగా ఉండటం వృద్ధురాలు కొంతదూరం నడిచి రావడంతో నీరస పడిపోయి ఠాణా ఆవరణలోనే కొద్దిసేపు పడుకుంది. అమ్మకు మెలకువ వస్తే.. కనిపించేది ఆవేదనే కదా!
ఇదీ చూడండి: BEGGAR FREE CITY: మాటలకే పరిమితమవుతున్న యాచకరహితనగరం