జంట నగరాల పరిధిలోని నాలాల్లో 221 కిలోమీటర్ల మేర పూడిక తొలగింపు కోసం… 45 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) తెలిపారు. బుధవారం సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట దర్గా వద్ద నాలాపై 2.35 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పూడిక తొలగింపు పనుల విషయమై ఈ నెల 11న జీహెచ్ఎంసీ(GHMC) కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆ సమావేశంలో తనతో పాటు హోం మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్ కుమార్లు పాల్గొంటారని అన్నారు. 124 ప్రాంతాల్లో 221 కిలోమీటర్ల మేర నాలాల్లో పూడిక తొలగింపు పనులను చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ పూడిక తొలగింపు వల్ల వర్షాకాలంలో నాలాల్లోకి వచ్చే నీరు సాఫీగా వెళ్తుందని చెప్పారు. జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో నాలాలతో పాటు మురుగు కాలవలను కలుపుకుని మొత్తం 884 కిలోమీటర్లు ఉన్నాయని అన్నారు. నాలాల మరమ్మతులు, పూడిక తొలగింపు పనులను ఆరుగురు ఎస్ఈలతో పాటు ఆయా ప్రాంతాల జోనల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని వెల్లడించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రత్యేక మాన్సూన్ బృందాలు, 128 మినీ మొబైల్ టీంలు, 68 డీసీఎం వాహనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గత ఏడాది కురిసిన వర్షాలకు జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో బీటీ, సీసీ రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. 182 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు మరమ్మతు పనులను 52 కోట్ల రూపాయలతో చేపట్టగా… ఇప్పటివరకు 100 కిలోమీటర్ల పనులు జరిగాయని అన్నారు. మరో 753 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పనులు… 204 కోట్ల రూపాయలతో చేపట్టగా, ఇప్పటి వరకు 272 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని వివరించారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ కొణతం దీపిక, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుందా రెడ్డి, ఈఈ శివానంద్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, ఎలక్ట్రికల్ ఏఈ రామకృష్ణ, టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Highcourt: ప్రజల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదు: హైకోర్టు