KTR On Jobs: ఒక ఆరు నెలలపాటు సినిమాలు కాస్త తక్కువగా చూడాలని ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు మంత్రి కేటీఆర్ సూచించారు. ఒక ఆరునెలలపాటు ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాలను బంద్ చేసి చదువుమీద దృష్టిపెట్టాలని సూచించారు. తల్లిదండ్రులను సంతోషపెట్టే విధంగా.. చదువుకు న్యాయం చేసే విధంగా ఒక ఆరు నెలలపాటు స్టడీస్‌పై ఫోకస్ చేయాలని సూచించారు.
మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పరిధిలోని ఫీర్జాదిగూడ కమాన్ నుంచి ప్రతాప్ సింగారం క్రాస్‌రోడ్డు వరకు రూ.25.32 కోట్ల వ్యయంతో 4.95 కిలోమీటర్ల నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం నిరుద్యోగ యువతీయువకుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
కష్టపడినా ఉద్యోగాలు రాలేదని యువత నిరాశ చెందవద్దని.. అనేక పైవేటు కంపెనీలను తీసుకొచ్చి వేల ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. యువతలో నైపుణ్యాలు పెంచేలా టాస్క్ (TASK) అనే ప్రభుత్వ సంస్థను ఏర్పాటుచేస్తున్నామని మంత్రి వెల్లడించారు. నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డిని కేటీఆర్ అభినందించారు. ఉద్యోగాలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత తొలి ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేసిన ఘనత మల్లారెడ్డికే దక్కుతుందన్నారు. కోచింగ్ సెంటర్ ఏర్పాటుచేసి ఉద్యోగాలు సాధించేలా యువతను శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే టాప్ ఐటీ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకొచ్చిన ఘనత మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని మల్లారెడ్డి ప్రశంసించారు.
"తెలంగాణ బిడ్డలకు కొలువులిచ్చిన సంస్థలకు అదనపు రాయితీలు ఇస్తున్నాం. తెలంగాణ యువతకే ఎక్కువ అవకాశాలు దక్కాలి అనే దృక్పథంతో ముందుకుపోతున్నాం. కేంద్రంలోనూ 15.62 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఆ మేరకు తెలంగాణలోనూ మరో 60 నుంచి 70 వేల ఉద్యోగాలు వస్తాయి. ఒక ఆరు నెలలపాటు సినిమాలు, క్రికెట్‌ను కాస్త తక్కువగా చూడండి. మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి.
- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి
"ప్రపంచం ఉన్న టాప్ ఇంజినీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు మన తెలంగాణ వాళ్లు, తెలుగువారే. రాష్ట్రంలో మస్తు ఉద్యోగాలు ఉన్నాయ్.. అవి సాధించే సత్తా యువతలో ఉండాలి. ఎప్పటికప్పుడు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి."
- మల్లారెడ్డి, రాష్ట్ర కార్మిక మంత్రి
ఇదీచూడండి: KTR On Data Science: 'డేటా సైన్స్‌కు గత ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యమివ్వలేదు'