రాష్ట్ర వ్యాప్తంగా పురపాలికలతోపాటు 9 నగరపాలక సంస్థల ఎన్నికల్లో తెరాస 8 చోట్ల తెరాస హవా కొనసాగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని జవహర్‌నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట, బడంగ్‌పేట, నిజాంపేట నగరపాలికల్లో గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.
బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లలో కారుదే హవా
బోడుప్పల్ నగరపాలిక పరిధిలోని 28 డివిజన్లలో తెరాస 14 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 7, భాజపా రెండు, ఐదు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో 26 డివిజన్లలో 16 స్థానాల్లో తెరాస విజయం సాధించింది. మూడింట కాంగ్రెస్, ఒక స్థానంలో భాజపా, 6 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. జవహర్‌నగర్‌లో 28 డివిజన్లలో 21 తెరాస కైవసం చేసుకుంది. రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా మిగిలిన ఐదు డివిజన్లలో ఇతరులు గెలిచారు. నిజాంపేటలో 33 డివిజన్లకుగానూ 26 స్థానాల్లో తెరాస విజయ ఢంకా మోగించింది. మిగిలిన ఏడు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు.
గట్టి పోటీ ఇచ్చిన భాజపా
బండ్లగూడ జాగీర్, మీర్‌పేట కార్పొరేషన్లలో గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. బండ్లగూడ నగరపాలిక పరిధిలోని 22 డివిజన్లలో తెరాస 14 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 5, భాజపా రెండు, ఒక డివిజన్‌లో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలో 46 డివిజన్లలో 19 స్థానాల్లో తెరాస విజయం సాధించింది. మూడింట కాంగ్రెస్, 16 స్థానాల్లో భాజపా, 8 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఆయా కార్పొరేషన్లలో కారు జోరుకు తెరాస శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.
ఇదీ చూడండి : కోమటిరెడ్డి బ్రదర్స్, గొంగిడి సునీత మధ్య వాగ్వాదం