Controversy Charlapalli liquor shop: మేడ్చల్ జిల్లా చర్లపల్లి పారిశ్రామికవాడలో మద్యం దుకాణం ఏర్పాటు వివాదాస్పదమవుతోంది. గతనెల కొత్త మద్యం దుకాణాల టెండర్లలో లాటరీ దక్కించుకున్న నిర్వాహకులు సరకు దింపేందుకు ప్రయత్నిస్తుండగా వాటిని అడ్డుకునేందుకు ఇక్కడి స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ అర్ధరాత్రి చలిలోనూ మంటలేసుకుని... మహిళలు తమ కుటుంబాలతో కూర్చుని ధర్నా చేస్తున్నారు. మద్యం దుకాణం ఏర్పాటు వెనుక స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ప్రమేయం ఉందంటూ కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాత్రి పూట అక్కడికి చేరుకున్న కార్పొరేటర్... ఎట్టిపరిస్థితుల్లోనూ ఇక్కడ దుకాణం ఏర్పాటు కానివ్వనని స్థానికులకు హామీ ఇచ్చారు. దీంతోపాటు నిర్వాహకులు తనకు రూ.50లక్షలు ఇస్తానన్నా వద్దన్నానంటూ బొంతు శ్రీదేవి తెలిపారు. తనకెవరైనా డబ్బులు ఇచ్చినట్లు ఆరోపణలు చేస్తే గుండుకు సున్నం రాసి చెప్పుల దండతో చర్లపల్లి వీధుల్లో ఊరేగించాలంటూ ఆందోళనకారులతో పేర్కొన్నారు. ప్రస్తుతం బొంతు శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: మహిళా కానిస్టేబుళ్లపైకి కత్తిపీటతో దూసుకొచ్చి..