రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐదేళ్ల చిన్నారి ఆద్య హత్యకేసులో నిందితుడు కరుణాకర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఘట్కేసర్ ఎస్సై రఘవీరా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరికి చెందిన సూరనేని కళ్యాణ్ రావు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అనూష 2011లో ప్రేమవివాహం చేసుకున్నారు. వారికి ఆద్య అనే ఐదేళ్ల పాప ఉంది. మూడేళ్లుగా వీరు పోచారం మున్సిపాలిటీలోని ఇస్మాయిల్‌ఖాన్‌గూడ విహారి హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు.
సెల్‌ఫోన్ వాయిదాల లావాదేవీల విషయంలో రెండేళ్ల క్రితం కరుణాకర్ అనే వ్యక్తితో అనూషకు ఏర్పడిన పరిచయం, వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త విధులకు వెళ్లిన అనంతరం కరుణాకర్ అనూష వద్దకు వచ్చేవాడు. అతడి వెంట అప్పుడప్పుడూ అతడి స్నేహితుడు రాజశేఖర్ కూడా ఉండేవాడు. ఈ క్రమంలో అతడితోనూ అనూష వివాహేతర సంబంధం పెట్టుకుంది. అనంతరం మెల్లమెల్లగా కరుణాకర్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది.
గత 3నెలలుగా అనూష తనతో సరిగ్గా లేకపోవడం గమనించిన కరుణాకర్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అనూష సంగతి తేల్చుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ రాజశేఖర్ చెప్పులు, బైక్ కనిపించడం వల్ల కోపంతో ఊగిపోతూ తలుపులు బాదాడు. అతడి రాకను గమనించిన అనూష.. రాజశేఖర్‌ను స్నానాలగదిలో దాచి, తలుపులు తీసింది. ఇంట్లోకి వచ్చిన కరుణాకర్, రాజశేఖర్‌ను బయటికి రాకపోతే ఆద్యను చంపేస్తానంటూ అరిచాడు. అయినా రాజశేఖర్ రాకపోవడం వల్ల.. కరుణాకర్ కత్తి తీసుకుని చిన్నారి గొంతు కోసేశాడు. ఈ ఘటనలో చిన్నారి ఆద్య మరణించినట్లు ఎస్సై రఘవీరారెడ్డి వెల్లడించారు.