మేడ్చల్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని మేయర్ మేకల కావ్య స్పష్టం చేశారు. జవహర్ నగర్ నూతన కార్పొరేషన్లో మేయర్గా మేకల కావ్య డిప్యూటీ మేయర్గా రెడ్డి శెట్టి శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యులంతా కలిసి వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వల్ల ఎలాంటి పోటీ లేకుండానే ప్రశాంతంగా ముగిసింది.
జవహార్ నగర్లో ఉన్న అనేక సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వం తరఫున నిధులు రాబట్టి అభివృద్ధి చేస్తామని కావ్య వెల్లడించారు. ఇప్పటికే రూ. 28 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని.. రానున్న రోజుల్లో వాటిని జవహర్ నగర్ ప్రాంత అభివృద్ధికి వినియోగించనున్నట్లు మేయర్ తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిదీపాలు ఇళ్ల పట్టాల విషయంలో భవిష్యత్ ప్రణాళిక రూపొందించి సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.