ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున చెట్లు కొట్టేసిన ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థకు అటవీ శాఖ భారీ జరిమానా విధించింది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కీసర మండలం బొమ్మరాస్పేట్లో వాసవి గ్రీన్ లీఫ్ వెంచర్స్‌లో పది రోజుల కిందట భారీగా చెట్లను నరికివేశారు. చెట్ల నరికివేతపై ఫిర్యాదు అందుకున్న మేడ్చల్ జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు విచారణ జరిపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది భారీ వృక్షాలను సంస్థ నరికేసిన విషయాన్ని నిర్ధరించారు.
![huge fine charged from vasavi green leaf venture for cutting trees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11377494_dvd.jpg)
వాల్టా చట్టం కింద వాసవి గ్రీన్ లీఫ్ వెంచర్స్ సంస్థపై కేసు నమోదు చేశారు. కోల్పోయిన పచ్చదనానికి బదులుగా సంస్థపై... 20 లక్షల రూపాయల భారీ జరిమానాను అటవీశాఖ వసూలు చేసింది. అదే సంస్థతో మళ్లీ పెద్ద ఎత్తున మొక్కలు కూడా నాటిస్తామని అధికారులు తెలిపారు. సొంత భూముల్లో అయినా... చెట్లు కొట్టేందుకు అటవీ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
![huge fine charged from vasavi green leaf venture for cutting trees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11377494_svsv.jpg)
ఎవరైనా చెట్లు కొట్టేందుకు అనుమతి కోరితే... విచారణ జరిపి, నిబంధనల ప్రకారం అనుమతి ఇస్తామన్నారు. కొద్ది మొత్తంలో అయితే జిల్లా అటవీ అధికారి, పెద్ద సంఖ్యలో చెట్లను తొలగించాల్సి వస్తే జిల్లా చెట్ల పరిరక్షణా కమిటీ విచారణ తర్వాత అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. హరితహారం ద్వారా పచ్చదనం పెంపునకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని చెట్ల నరికివేతను నివారించాలని... తప్పనిసరి అయితే మాత్రం చట్ట ప్రకారం అనుమతులు పొందిన తర్వాతే చెట్ల తొలగింపును చేపట్టాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ తెలిపారు.