మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో భూమాఫియా రెచ్చిపోతుంది. అడ్డొచ్చిన వారిపై దాడులకూ తెగబడుతోంది. మొన్న క్రీడా మైదానం.. నిన్న ఆధునిక మరుగుదొడ్లు.. నేడు మార్కెట్ కోసం కేటాయించిన ప్రభుత్వ భూములను స్వాహా చేశారు. తాజాగా జవహర్‌నగర్ ఉపమేయర్ శ్రీనివాస్ సహా మరో ఐదుగురిపై భూకబ్జా కేసు నమోదు సంచలనం సృష్టించింది. కబ్జాదారులంతా ఒక్కటై అధికారులను బదిలీ చేయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
వేయి ఎకరాలకు పైగా... 1941లో బ్రిటీష్ అకాడమీ అధికారులు అప్పట్లో మిలిటరీ అవసరాల కోసం తీసుకున్న 5977 ఎకరాలను తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు. 1958లో జవహర్‌నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరిట వాటిని మార్చారు. దశలవారీగా 2004 వరకు 2370.25 ఎకరాలను హెచ్‌ఎండీఏకు సర్కారు అప్పగించింది.ప్రముఖ సంస్థలు రావడంతో ఇళ్ల స్థలాలకు డిమాండ్ పెరిగింది. కబ్జాదారులు 5 ఎకరాలు, 10 ఎకరాల చొప్పున ప్రభుత్వ భూములను చదును చేసి 80-200 గజాల వరకు ప్లాట్లుగా విభజిస్తున్నారు. నోటరీపై విక్రయిస్తున్నారు. ఇలా రూ.500 కోట్ల విలువైన 795 ఎకరాలు కబ్జాకు గురయ్యాయంటూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పుడది వేయి ఎకరాలకు పైగానే ఉంటుందని పేర్కొంటున్నారు.
ఎవరికి వారు తప్పించుకొని..
రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారుల మధ్య సమన్వయం లేదు. మాది కాదంటే.. మాది కాదంటూ చేతులెత్తేశారు. కొందరు హెచ్‌ఎండీఏ అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కఠినంగా వ్యవహరిస్తుంటే దాడులకు దిగుతున్నారంటూ రెవెన్యూ అధికారులు వాపోతున్నారు.
ఇటీవల ఉదంతాలు గమనిస్తే..
* సర్వే నం: 613, 614లో అయిదెకరాల ప్రభుత్వ భూమి ఉంది. మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేశారు. కొందరు దీన్ని చదును చేసి 80-100 గజాల చొప్పున ప్లాట్లుగా విభజించి రూ.3 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకు విక్రయించారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు జవహర్‌నగర్ ఉప మేయర్, మరో ఐదుగురిపై కేసు పెట్టారు.
* సర్వే నం: 510లోని 2వేల గజాల సర్కారు భూమిని ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. కబ్జాదారులు మాజీ సైనికులను తెరపైకి తెచ్చి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మున్సిపాలిటీ నుంచి ఎన్వోసీ తెచ్చి బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. స్థానికులు ఆందోళనకు దిగడంతో అధికారులు స్వాధీనం చేసుకుని పార్కును అభివృద్ధి చేశారు. ధ్వంసం చేసి కబ్జాకు యత్నించడంతో కేసు నమోదైంది.
* బాలాజీనగర్‌లోని సర్వే నంబర్లు 432లో 1500 గజాలు, 495లో 510 గజాలను ఆధునిక మరుగుదొడ్ల కోసం కేటాయించి శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభమయ్యే సమయానికి ఇక్కడ ఇళ్లు వెలిశాయి.. అధికారులు వెళ్లగా ఆక్రమణదారులు దాడులకు తెగబడ్డారు. జవహర్‌నగర్ సీఐ భిక్షపతిరావుకు మంటలంటుకుని తీవ్ర గాయాలపాలయ్యారు.
- ఇదీ చూడండి : భూ తగాదా: కత్తులతో దాడి చేసిన మాణిక్య రెడ్డి