పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి రాంచందర్‌రావు ప్రశ్నించే గొంతుకే అయితే.. తెలంగాణకు ఐటీఐఆర్ రానందుకు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై కేంద్రాన్ని నిలదీయాలని.. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భాజపా గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు.
ఉద్యోగాల లెక్కలడిగే నైతిక హక్కు ఉందా?
కేంద్ర బడ్జెట్లోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని హరీశ్ అన్నారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే మెట్రోరైలు, బుల్లెట్ ఇచ్చారని.. కూకట్పల్లి నుంచి పటాన్‌చెరుకు ఎందుకు పొడిగించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగాలను.. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఊడగొట్టిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేసి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను దూరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగాల కోసం మాట్లాడే నైతిక హక్కు ఉందా అని హరీశ్ నిలదీశారు. కూకట్‌పల్లితో పాటు హైదరాబాద్ అంతటా అభివృద్ధి పరంపర కొనసాగాలంటే ఎమ్మెల్సీగా తెరాస అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని కోరారు.
విద్యా, రాజకీయ రంగాలు తనకు కొత్తకాదని.. తెరాస అభ్యర్థి వాణీదేవి అన్నారు. పీవీ వారసురాలిగా రాజకీయాల పట్ల అవగాహన ఉందన్నారు. తొలి ప్రాధాన్య ఓటు తనకు వేసి గెలిపించాలని కోరారు.
ఇంటింటికి మంచినీళ్లిచ్చి, కళ్యాణ లక్మి ఇచ్చి.. కడుపులో పెట్టుకొని పేదలను కేసీఆర్ కాపాడుతున్నారు. కళ్లలో నీళ్లొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇంధన ధరలు, గ్యాస్, నిత్యవసర ధరలు పెంచుకుంటూ పోతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచుతున్న భాజపాకు ఎందుకు ఓటువేయాలి. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న భాజపా.. ఉద్యోగాల గురించి అడిగే నైతిక హక్కు ఉందా. తెరాస ప్రభుత్వం.. ఇప్పటికే 1.34 లక్షలు ఉద్యోగాలిచ్చింది. త్వరలో 50 వేల కొలువులకు నోటిఫికేషన్ ఇస్తాం. ఇంకో 25 వేల ఉద్యోగాలు పైప్‌లైన్‌లో ఉన్నాయ్. హైదరాబాద్‌లో అభివృద్ధి పరంపర కొనసాగాలంటే తెరాస అభ్యర్థికే ఓటేయాలి. గ్యాస్, ఇంధన ధరలు, ఐటీఐఆర్‌పై.. ఒక మాజీ ప్రధానమంత్రి బిడ్డగా వాణక్క బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తది. ప్రశ్నించే గొంతుకగా వాణక్క.. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తది.
- హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి
ఈ సమావేశంలో కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ తదితురులు పాల్గొన్నారు. తెరాస కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి వాణీదేవిని గెలిపించాలని సూచించారు.
ఇవీచూడండి: ఎన్‌డీఏ అంటే నో డేటా అవైలబుల్: కేటీఆర్