CM KCR Meeting with Gajwel Constituency BRS Leaders : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంటలోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్‌లో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రి హరీశ్‌రావు, ముఖ్య నేతలు వంటేరు ప్రతాప్ రెడ్డి, రఘోత్తమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్, కొండపాక, కుకునూర్‌పల్లి, జయదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, వర్గల్, తూప్రాన్, మనోహరాబాద్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ అధినేత మాట్లాడారు.
CM KCR Speech at Sircilla Public Meeting : 'ధరణి ఉండాలో.. రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి'
ఈ సందర్భంగా త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ సాధించబోతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఆగదని.. ప్రగతిపథంలో ఇంకా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత విద్యుత్, తాగు నీటి సమస్యలు పరిష్కరించుకున్నామన్న కేసీఆర్.. సాగు నీటి ప్రాజెక్టుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు.
గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఉండాలన్నదే తన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం.. ప్రతి నెల ఒక రోజు గజ్వేల్ నియోజకవర్గానికి కేటాయిస్తానని చెప్పారు. ప్రజల మధ్యే గడుపుతూ అభివృద్ధి సమీక్షిస్తానని తెలిపారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారం పది రోజుల్లో ఉన్నతస్థాయి సమీక్ష ద్వారా తగిన ఆదేశాలు జారీ చేస్తానన్నారు. ఈ క్రమంలోనే తాను గెలిచిన తర్వాత మళ్లీ సీఎం హోదాలో తొలి సమావేశం ఈ హాలులోనే ఏర్పాటు చేసుకుందామని.. గజ్వేల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దుతానని కేసీఆర్ వెల్లడించారు.
గజ్వేల్‌లో ఒక విడత అభివృద్ధి పనులు జరిగాయని కేసీఆర్ పేర్కొన్నారు. రెండో విడతలో మరింత అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు. కామారెడ్డికి ఎందుకు పోతున్నారని గజ్వేల్ నేతలు అడిగారన్న సీఎం.. కామారెడ్డిలో పోటీ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే గజ్వేల్‌ను వదిలిపెట్టి పోయేది లేదని చెప్తున్నానని.. తనను ఎంత మెజార్టీతో గెలిపిస్తారనేది ప్రజల దయ అని వ్యాఖ్యానించారు. ఇకపై గజ్వేల్ నియోజకవర్గానికి ప్రతి నెలా ఒకరోజు కేటాయిస్తానని సీఎం స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి వస్తుంది. 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నాం. విద్యుత్, తాగు నీరు సమస్యలు పరిష్కరించుకున్నాం. గజ్వేల్ నియోజకవర్గంలో ఒక్క నిరుపేద ఉండొద్దన్నదే లక్ష్యం. ఇకపై ప్రతి నెలలో ఒక రోజు గజ్వేల్ నియోజకవర్గానికి కేటాయిస్తా. రాష్ట్రానికే తలమానికంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దుతా. - సీఎం కేసీఆర్
35 రోజులు కష్టపడి రుణం తీర్చుకోండి..: కార్యకర్తల ఉత్సాహం చూస్తే గజ్వేల్ కొత్త చరిత్ర సృష్టించేలా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ రుణం తీర్చుకోవాలంటే 35 రోజులు కష్టపడాలని సూచించారు. అత్యధిక మెజార్టీతో కేసీఆర్‌ను గెలిపించి గజ్వేల్‌ను చరిత్ర పుటల్లో నిలుపుదామని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రేకెత్తించారు. గజ్వేల్ నుంచి హ్యాట్రిక్.. తెలంగాణ సీఎంగా హ్యాట్రిక్ కొట్టాలని.. అందుకోసం కార్యకర్తలు, శ్రేణులు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.