మేడ్చల్ జిల్లాలో ఆర్టీసీ డిపోల వద్ద ఉదయం నుంచే ఉద్రిక్తత నెలకొంది. తెల్లవారుజాము నుంచే నుంచే విధుల్లో చేరేందుకు సిబ్బంది రాగా... పోలీసులు అడ్డుకున్నారు. సంస్థ అనుమతి లేదంటూ.. వారిని లోనికి వెళ్లనీయలేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జీడిమెట్ల డిపో ఎదుట పోలీసులు విధుల్లోకి చేరడానికి వచ్చిన సుమారు 20 మంది కార్మికులను అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పలువురు జేఏసీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు.
తమ న్యాయమైన డిమాండ్లను సాధించేందుకు చేస్తున్న సమ్మె 53వ రోజుకు చేరినా ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తుందని జేఏసీ నాయకులు రాజు ఆరోపించారు. విధుల్లోకి చేరడానికి వస్తున్న కార్మికులను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి... తమ సమస్యలు పరిష్కరించకపోతే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
హామీ పత్రాలు ఇస్తుంటే అడ్డుకుంటారా...?
మేడ్చల్ జిల్లా కేంద్రంలోని డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. ఉద్యోగాల్లో చేరతామని డిపో మేనేజర్‌కు హామీ పత్రాలు ఇస్తుంటే... పోలీసులు తమను బయటకు పంపించడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ