ప్రలోభాలకు లొంగని తత్వం హుజూరాబాద్ ప్రజల్లో ఉందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధంలో ప్రజలు ధర్మంవైపు నిలిచారని పేర్కొన్నారు. అధికార పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా... ప్రజలకు అందుబాటులో ఎవరు ఉండి సేవ చేస్తారో వారినే గెలిపించారని గుర్తుచేశారు. సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి వచ్చిన తరుణంలో హుజూరాబాద్ ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చారని అన్నారు. ఒకనాడు రాజకీయాలంటే ప్రజలకు సేవ చేసే కోణంలో ఉండేవని కానీ.. కేసీఆర్ మాత్రం వ్యాపారం చేశారని మండిపడ్డారు. ఓటు కోసం డబ్బులిచ్చి పసుపు కుంకుమ మీద, కుల దేవతల మీద ప్రమాణం చేయించారని ఆరోపించారు. మేడ్చల్ జిల్లా పూడూర్ మండలంలోని తన నివాసానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్, వడ్డెర సంఘాల సభ్యులతో కలిసి కొంతసేపు ముచ్చటించారు. అనంతరం హుజూరాబాద్‌లో విజయం సాధించిన ఈటలను శాలువా కప్పి, పుష్పగుచ్చాలు అందించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
సంతోషం వ్యక్తం చేసిన ఈటల...
హుజూరాబాద్ బిడ్డలు అందించిన విజయం దేశ చరిత్రలో నిలిచిపోతుందని ఈటల అన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, ప్రజలు వచ్చి అభినందిస్తుంటే సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రశంసలన్ని హుజూరాబాద్ ప్రజలకే చెందుతాయని పేర్కొన్నారు.
ఈటల సేవలు ఏపీలో అవసరం...
బీసీలకు రాజకీయంగా ఈటల ఒక మార్గాన్ని చూపారని ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు చప్పిడి కృష్ణ మోహన్ అన్నారు. డబ్బు ప్రధానం కాదని... ప్రజల్లో ఉండి ఎవరైతే నిరంతరం సేవ చేస్తారో వారికే ఓటు వేసి గెలిపిస్తారనే విషయాన్ని ఈటల నిరూపించారని తెలిపారు. రాజేందర్ సేవలు ఏపీలో కూడా అవసరం ఉన్నాయని పేర్కొన్నారు. బీసీ(డీ)లోని కొన్ని కులాలను బీసీ(ఏ)లోకి మార్చేలా ఈటల కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని కృష్ణ మోహన్ కోరారు. ఆయనను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని 13జిల్లాలకు చెందిన వడ్డెర, పద్మశాలి, శాలివాహన సంఘాల నాయకులు ఉన్నారు.
రాష్ట్రాలు చల్లగా ఉండాలనే సమాజహితులు .. వాళ్లు గుజరాత్లో ఉన్న మహారాష్ట్రలో ఉన్న, అమెరికాలో ఉన్నా, లండన్‌లో ఉన్నా అందరు కూడా ధర్మం గెలవాలని కోరారు. ధర్మానికి ప్రతీకగా ఉన్న ఈటల రాజేందర్ విజయం సాధించాలని కోరారు తప్పా మరేది కోరలేదు. హుజూరాబాద్ ఉపఎన్నికలో డబ్బుకు ఆస్కారం లేదు. ఈ ఎన్నిక కేవలం ఆత్మగౌరవానికి, మానవ సంబంధాలకు మాత్రమే ఆస్కారం ఉందని నిరూపించింది. ఈ రోజు ఆన్ని జిల్లాల నుంచి కులమతమని తేడా లేకుండా వందలాది మంది ప్రజలు వచ్చి... అన్నా.. ప్రాంతాలు వేరు అయ్యి ఉండవచ్చు కానీ మనమంతా ఒక్కటే అన్నారు. మీరు పోరాడిన తీరు, మీ ప్రజలిచ్చిన విజయం చరిత్రలో నిలిచిపోతుంది. నిజంగా ఈ ప్రశంసలన్ని హుజూరాబాద్ ప్రజలకే చెందుతాయి.-ఈటల రాజేందర్ ,హుజూరాబాద్ ఎమ్మెల్యే
ఇదీ చదవండి:KTR letter to Piyush Goyal: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు కేటీఆర్ లేఖ..