సొంత అవసరాలకు చెరువు వాగులో ఇసుక తవ్వుతూ మట్టిపెళ్లలు విరిగి పడటం వల్ల ఇద్దరు సజీవ సమాధి అయ్యారు. వేర్వేరుగా జరిగిన ఈ ఘటనలు మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలం గౌతాపూర్, చిలప్‌చెడ్ శివారులో సోమవారం చోటుచేసుకున్నాయి. రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపాయి.
చిలప్‌చెడ్ మండల కేంద్రానికి చెందిన మురళి(32) శౌచాలయం నిర్మాణానికి భార్య నాగమణితో కలిసి గ్రామ సమీప చెరువు నీరు పారే కాలువలో ఇసుక తెచ్చేందుకు వెళ్లారు. పెద్ద గొయ్యి తవ్వారు. అందులోంచి ఇసుక తీస్తుండగా పైనుంచి మట్టిపెళ్లలు విరిగి పడటం వల్ల మురళి అందులో కూరుకుపోయాడు. రక్షించేందుకు భార్య ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
మరో ఘటనలో మండలంలోని గౌతాపూర్ గాశెట్టికుంట వాగు పరీవాహక ప్రాంతంలో రాందాస్‌గూడకు చెందిన వడ్డెపల్లి కిరణ్(17) ఇసుక తవ్వుతుండగా పైనుంచి మట్టిపెళ్లలు కూలిపడటం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇద్దరి కుటుంబ సభ్యులు మృతదేహాలను పోలీస్ స్టేషన్ ఎదుట ఉంచి గ్రామస్థులు నిరసనకు దిగారు. గ్రామాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు. పోలీసులు వారికి సర్దిచెప్పడం వల్ల ఇరు కుటుంబ సభ్యులు శాంతించారు.
ఇవీ చూడండి : 'గెలుపు కోసం కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి'