అటవీ అధికారులపై గిరిజనులు దాడి చేసిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. నర్సాపూర్ మండల పరిధిలోని ధర్మతండా సమీపంలో 330 కంపార్ట్‌మెంట్‌లో ఒక ఎకరం విస్తీర్ణంలో సుమారు 500 మొక్కలను తండాకు చెందిన రమావత్ జగన్ కుటుంబసభ్యులు సోమవారం తొలగించారు. కొండాపూర్ బీట్ అధికారి ప్రశాంత్‌కుమార్... సెక్షన్ అధికారి బాలేష్‌కు దీనిపై సమాచారం తెలిపారు. మధ్యాహ్న సమయంలో బాలేష్, ప్రశాంత్‌కుమార్, మరికొంతమంది సిబ్బందితో అక్కడికి కలిసి వెళ్లారు. గతంలో జగన్ 350 మొక్కలు తొలగించగా నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అది మనసులో ఉంచుకున్న గిరిజనులు జగన్, అమ్మి, రవి, శాంతి, రేణుక, లలిత ఒక్కసారిగా అటవీ సిబ్బందిని అడ్డుకున్నారు. గొడవ చేయవద్దని వారిస్తున్నా వినకుండా దాడికి దిగారు. సెక్షన్ అధికారి బాలేష్, ప్రశాంత్‌కుమార్‌లకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమను చంపడానికి దాడి చేశారని బాలేష్ నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'తీసుకున్న భూమిని వినియోగించకుంటే చర్యలు తప్పవు'