మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్పల్లిలో జరిగిన ఘటన మరోసారి పాలకులు,అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. ఇదివరకు ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినా అటు పాలకులు, ఇటు అధికారులు నిర్లక్ష్యం వదలడం లేదు. బోరు వేసినప్పుడు పడకపోతే బోరు బండి యాజమనే దాన్ని పూడ్చే వరకు బోరు లారీ కదలకుండా నిబంధన రూపొందించలేని నిర్లక్ష్యం మరో ప్రాణాన్ని బలిగొంది.
బోరు వేస్తున్నప్పుడు పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోకుండా తల్లిదండ్రులు వదిలేశారని సాక్షాత్తూ కలెక్టర్ ఆరోపించటం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. కేవలం 15 అడుగుల లోతులో ఉన్న బాలునికి కనీసం సమయానికి ఆక్సిజన్ అందించలేని వ్యవస్థ మనదని జనం ఆగ్రహిస్తున్నారు. అసలే బోర్లు పడక ఆ కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉన్న సమయం అది. అలాంటి సమయంలో శోకంలో మునిగిన వారికి ఏమరపాటు ఉంటుంది. పిల్లాడిని నిర్లక్ష్యంగా ఏ తల్లిదండ్రులూ వదిలేయరు. బోరు వేసిన తర్వాత... నీళ్లు పడకపోతే వెంటనే దాన్ని పూడ్చివేయాలనే నిబంధన ఎందుకు లేదు? ఇన్ని ఘటనలు జరిగినా ఎందుకు రాదు? బోరు వేసిన లారీ సిబ్బందిదే ఆ బాధ్యతని నిబంధనలు ఎందుకు రూపొందించరు? బోరు పూడ్చివేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. బోరు కొంత కాలం నడిచి మధ్యలో ఎండిపోతే కేసింగు ఉంటుంది. ఆ కేసింగు పైప్ తీసేస్తే దాన్ని పూడ్చే బాధ్యత రైతులపైనే ఉండటం సమంజసం. ఇలాంటి నిబంధనలు లేవా? బోరు వేసిన అరగంటలోనే పసి ప్రాణం బలికోరటం ఏంటి? బోరు పడకుంటే లారీ సిబ్బందే దాన్ని పూడ్చేలా నిబంధనలుంటే.. ఈ దుస్థితి దాపురించేది కాదు. మరో పసి ప్రాణం ఆవిరయ్యేది కాదు.
ఘటన జరిగాక తప్ప స్పందించని అధికారులు అంతా జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. బోరు వేయాలంటే అనుమతి కావాలి. కానీ ఎటువంటి అనుమతి లేకుండానే బిక్షమయ్య బోరు వేయించాడు. అసలు అనుమతి లేనిదే లారీ ఎలా వచ్చింది? ఏ అనుమతి పత్రాలు చూపిస్తే లారీ వచ్చింది? రైతుకు 'నీరు కావాలి.. తన పొలం పండాలి..' ఇంతే తెలుసు. అందుకోసం రక్తాన్ని చెమటగా చిందిస్తాడు. అలాంటిది బోరు వేయించుకోవాలనుకోడా? పొలం కోసం జలం కోసం బోరు వేయించాడు. అనుమతులు మన్ను మషాణం అతనికేం తెలుసు. సాగుకు నీళ్లు కావాలి. అప్పు తెచ్చయినా బోరు వేయించాలి అంతే. అయితే ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నట్లు అనేది ప్రశ్న. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. ఓ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చింది. ఇప్పటికైనా సమగ్ర నిబంధనలు రూపొందించి ఇలాంటి ఘటన మరొకసారి జరగకుండా.. మరో కుటుంబానికి గర్భశోకం మిగలకుండా అధికారులు, పాలకులు ఏమైనా చేస్తారా?
ఇదీ చదవండి: 'మైలురాయిని మంచి కోసం ఉపయోగించిన సామ్'