Devotees rush in temples: 2021 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం చెబుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. తొలి రోజున ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. వీధులన్నీ ముచ్చటైన రంగవల్లులతో కనువిందు చేశాయి. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ మహిళలు ముగ్గులను అందంగా తీర్చిదిద్దారు.
యాదాద్రిలో
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీ పెరిగింది. దర్శనానికి సుమారు రెండుమూడు గంటల సమయం పడుతోంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు.. స్వామివారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. లడ్డూ ప్రసాదాలు 69 వేలు తయారుచేశామని ఆలయ కార్యనిర్వాహక అధికారి గీతారెడ్డి తెలిపారు. ప్రసాదాల విక్రయాలు రాత్రి 10 గంటల వరకు కొనసాగిస్తామని చెప్పారు.
రామయ్య సన్నిధిలో
భద్రాద్రి రామయ్య ఆలయంలో కొత్త ఏడాది తొలిరోజు భక్తుల రద్దీ పెరిగింది. శ్రీసీతారామలక్ష్మణులను దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతాలన్నీ సందడిగా మారాయి.
భద్రకాళి ఆలయంలో
హనుమకొండ వేయి స్తంభాల ఆలయంలో తెల్లవారుజాము నుంచే నూతన సంవత్సర సందడి నెలకొంది. రుద్రేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం దాతల సహకారంతో అన్నదానం చేపట్టారు.
బిర్లా మందిర్కు పోటెత్తిన భక్తులు
నూతన సంవత్సరం తొలి రోజున హైదరాబాద్లో ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం నుంచి భక్తులతో కళకళలాడాయి. బిర్లా మందిర్కు భక్తులు పోటెత్తారు. వేకువజామున నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు కొత్త ఏడాది ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించాలని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ సందర్భంగా యువతీయువకులు సెల్ఫీ దిగుతూ ఆనందంగా గడిపారు.
శ్రీనివాసుని సన్నిధిలో
వనస్థలిపురంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కొత్త ఏడాది కలిసి రావాలని భక్తులు ప్రార్థించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ ఛైర్మన్ లక్ష్మయ్య తెలిపారు.
వనదుర్గా భవాని దర్శనానికి
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్ పల్లిలోని ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారిని వివిధ రకాల పూలతో విశేష అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, సహస్రనామార్చన చేశారు. భవానీ మాతను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
ఇదీ చదవండి: Telangana Governor on Omicron : 'అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే నా ఆకాంక్ష'