Telangana HC on Khadeer Khan death case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఖదీర్‌ఖాన్ మృతి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. నేడు విచారణ చేపట్టింది. ఖదీర్‌ఖాన్ మృతిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్ శాంతికుమారి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మెదక్ ఎస్పీ, మెదక్ డీఎస్పీ, ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా కోర్టులో హాజరుపరిచిన 14 రోజులకు ఖదీర్ మరణించారని అదనపు ఏజీ వాదనలు వినిపించగా.. ఖదీర్ మృతికి కారణాలపై విచారణ జరుపుతామని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది.
అసలు ఏం జరిగిందంటే..: మెదక్ జిల్లా కేంద్రంలో గత నెల 27న జరిగిన ఓ గొలుసు దొంగతనం కేసులో ఖదీర్‌ఖాన్‌ను అనుమానితుడిగా భావించిన పోలీసులు.. 29న హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని మెదక్‌కు తరలించారు. 5 రోజులు తమ కస్టడీలో ఉంచుకున్న అనంతరం భార్యను పిలిపించి ఖదీర్‌ను అప్పగించారు. అతడు ఆసుపత్రికి వెళితే తమ బండారం బయటపడుతుందని భావించి.. ఖదీర్‌ను ఇంట్లోనే ఉంచి మాత్రలు వేయాలని సూచించారు.
ఖదీర్ ఖాన్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో కుటుంబసభ్యులు మొదటగా మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కొంపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు, అక్కడి నుంచి గాంధీకి తీసుకెళ్లారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న ఖదీర్ మృతి చెందాడు.
పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే తన భర్త మరణించాడని.. బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ 17న అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన ఉన్నతాధికారులు బాధ్యులను సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదీ చూడండి..
ఖదీర్‌ఖాన్ మృతి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
మొన్న మరియమ్మ.. నేడు ఖదీర్ ఖాన్.. పోలీసుల థర్డ్ డిగ్రీతో బలవుతున్న అమాయకులు