పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉండి పెట్టుబడి సాయం అందని రైతులకు ప్రభుత్వం లబ్ధి చేకూర్చనుంది. అర్హత కలిగిన ప్రతి రైతుకు సాయం అందించాలని నిర్ణయించింది. మెదక్ జిల్లాలో అధికశాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలోని ఇరవై మండలాల్లో 2.20 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ ఏడాది జూన్ 16 నాటికి పట్టాదారు పాసుపుస్తకం పొందిన వారికి వానాకాలం సీజన్‌లో రైతుబంధు సహాయం అందించారు.
గత రబీ సీజన్ నుంచి ఇప్పటి వరకు పథకంలో 33,452 మంది రైతులు పెరిగారు. ఈక్రమంలో జిల్లాలోని 2.20 లక్షల మందికి ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున రూ.196.67 కోట్లు అవసరం. ఇప్పటిదాకా 2.08 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ కాగా, మిగిలిన రైతులు పెట్టుబడి సహాయానికి దూరమయ్యారు.
వివరాలు అందించకపోవడంతో..
జిల్లాలో పలువురికి పట్టాదారు పాసుపుస్తకాలున్నా నిర్ణీత గడువులోగా వివరాలు ఇవ్వకపోవడంతో రైతుబంధు సహాయం పొందలేకపోయారు. వివరాలు సక్రమంగా అందించని వారు నాలుగు వేల మంది ఉండగా, కొత్తగా పాసుపుస్తకం పొందిన వారు రెండు వేలకు పైగా ఉన్నారు. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఈనెల 16 వరకు వివరాలు అందించి.. తప్పులు సవరించుకునేందుకు గడువు ఇచ్చింది. ఈక్రమంలో రెండు సీజన్లలో పెట్టబడి డబ్బులు అందని 4,367 మంది, ఇటీవల పాసుపుస్తకం పొందిన రైతులు 2,822 మంది ఉన్నారు. మొత్తం 7,210 మంది ప్రభుత్వ సహాయానికి దూరంగా ఉన్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం మరో అవకాశం కల్పించడంతో రైతులు ఆయా మండలాల వ్యవసాయ విస్తరణ అధికారులకు పట్టాదారు పాసుపుస్తకాలు, బ్యాంకు ఖాతా వివరాలను అందజేయాల్సి ఉంటుంది.
అన్నీ సక్రమంగా ఉండాలి
రైతుబంధు అందని వారు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా ప్రతులను వ్యవసాయ విస్తరణ అధికారులకు ఇవ్వాలి. సాంకేతిక కారణాలతో కొందరికి నగదు జమ కావడం లేదు. అలాంటి వారు కొత్త ఖాతా వివరాలను అందజేయాలి. అన్ని వివరాలు ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం అందించేందుకు కృషి చేస్తున్నాం.
పరశురాంనాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి