మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రమైన నార్సింగి నుంచి చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి వరకు రహదారి రూపు కోల్పోయింది. దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మూడేళ్ల క్రితం శాసనసభ సమావేశాల్లో సదరు రోడ్డు గురించి ప్రస్తావించారు. ఈక్రమంలో ఎనిమిది నెలల క్రితం మరమ్మతులకు రూ.2 కోట్లు కేటాయించారని.. పనులు ప్రారంభం అవుతాయని అప్పట్లో దుబ్బాక, మెదక్ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, పద్మాదేవేందేర్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
మొత్తం ఆరు కిలోమీటర్లు..
నార్సింగి నుంచి మీర్జాపల్లి వరకు నాలుగు కిలోమీటర్లు కాగా.. మీర్జాపల్లి నుంచి చిన్నశంకరంపేటకు రెండు కిలోమీటర్లు. మొత్తం ఆరు కి.మీ దూరం ఉంటుంది. ఇందులో నార్సింగి నుంచి మీర్జాపల్లి వరకు రహదారి అధ్వానంగా ఉంది. ఎక్కడ చూసినా గుంతలు ఉండటంతో వాహనాదారులు అవస్థలు పడుతూ ముందుకు సాగుతుంటారు. ఈ రహదారిని మరమ్మతులు చేయక సుమారు పది సంవత్సరాలు అవుతుంది. మరోవైపు మీర్జాపల్లి రైల్వేస్టేషన్‌కు ఇదే మార్గం నుంచి వెళ్లాలి. ఇదిలా ఉండగా నార్సింగి నుంచి శేరిపల్లి వరకు రెండు కిలోమీటర్ల రోడ్డు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉంది. అక్కడి నుంచి మీర్జాపల్లి మీదుగా చిన్నశంకరంపేట పద్మరాయనిగుట్ట వరకు నాలుగు కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉంది. పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న రోడ్డుకు ఇటీవల రూ. 4.15 కోట్లు మంజూరు అయ్యాయి. ఒకే రోడ్డు రెండు శాఖల పరిధిలో ఉండటంతో నిర్వహణ అధ్వానంగా మారిందని వాహనదారులు అంటున్నారు.
జిల్లా కేంద్రం మెదక్‌వెళ్లడానికి దగ్గరి దారి..
44వ జాతీయ రహదారి నార్సింగి నుంచి మెదక్ వెళ్లటానికి ఈ మార్గం దగ్గరగా ఉంటుంది. ఏడు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రస్తుతం రహదారి బాగా లేకపోవడంతో చాలా మంది చేగుంట మీదుగా మెదక్ వెళ్తున్నారు. చిన్నశంకరంపేట మండలంలో ఉన్న పరిశ్రమలు ఈ రహదారిపైనే ఉన్నాయి.
టెండర్ పనులు పూర్తి చేశాం..
మరమ్మతు పనులకు టెండర్ పూర్తిచేయటం జరిగింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. చిన్నశంకరంపేట నుంచి శేరిపల్లి రోడ్డు వరకు పనులు చేపట్టి పూర్తి చేస్తాం.
- విజయసారథి, ఆర్‌అండ్‌బీ ఏఈ, మెదక్
పనులు చేపడతాం..
శేరిపల్లి నుంచి నార్సింగి మీదుగా నర్సంపల్లి వరకు రహదారిని బాగు చేయడానికి ఇటీవల నిధులు మంజూరు అయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి త్వరలో పనులు చేపడతాం.
- నర్సింలు, పీఆర్ డీఈఈ, తూప్రాన్
ఇదీ చదవండి: ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ చట్టం!