మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిపై కలెక్టర్ ఎస్.హరీష్ టెలికాన్ఫరెన్స్ ద్వారా వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నుల లోపే ధాన్యం దించడంపై నిర్లక్ష్యం కనిపిస్తోందని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఒక్కో రైసు మిల్లు రోజూ 25 లారీల ధాన్యాన్ని దించుకోవచ్చని, 33 రైస్ మిల్లులలో 2 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దించవచ్చని అన్నారు. హమాలీలను ఎక్కువ సంఖ్యలో పెట్టుకుని రోజుకు 25 లారీల ధాన్యం దించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇంకా ఎంత ధాన్యం వచ్చే అవకాశం ఉందో వివరాలు అందించాలన్నారు. మిల్లుల వద్ద ఎన్ని లారీలు ఆగాయి, ఎన్ని రోజుల నుంచి వేచిచూస్తున్నాయి వంటి వివరాలు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో గమనించి పరిష్కరించాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. రానున్న మూడ్రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్న కలెక్టర్... ధాన్యం తడవకుండా 10వేల టార్పాలిన్లు అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 76 రైతు వేదికలను ధాన్యం భద్రపరిచేందుకు ఉపయోగించుకోవాలన్నారు. ప్రస్తుతం తడసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రవాణా చేయాలని ఆదేశించారు.
వచ్చే 10 రోజులు చాలా క్లిష్టమైనవన్న కలెక్టర్.. అధికారులు ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వచ్చే వానాకాలం లారీల సంఖ్యను, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ల సంఖ్యను పెంచుకునేలా పౌర సరఫరా శాఖకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. టెలికాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ జి.రమేష్, జిల్లా రైస్ మిల్లుల సంఘం అధ్యక్షుడు చంద్రపాల్, జిల్లా పౌర సరఫరా అధికారి శ్రీనివాస్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, పౌర సరఫరా అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి; రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్ తీవ్ర ప్రభావం