రాబోయే కాలంలో మెదక్ పట్టణంలో వాహనాల రద్దీ వ్యవస్థను మెరుగు పరచడం కోసం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్(traffic police station)ను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి( padma devender reddy) పేర్కొన్నారు. మెదక్‌లో పట్టణ ప్రగతిలో భాగంగా 60 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు పలు వార్డుల్లో శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్(CM KCR) అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. పల్లెలు అభివృద్ధి చెందడం కోసం పల్లె ప్రగతి, పట్టణాలు అభివృద్ధి చెందడం కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.
మెదక్‌లో మెయిన్ రోడ్డు ఇబ్బందికరంగా మారిందని… దానిని దృష్టిలో ఉంచుకుని రోడ్డు వెడల్పు, చౌరస్తా, సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం, వెయ్యి డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. ఎవరికైతే సొంత స్థలాలు ఉంటాయో వారి వారి స్థలాల్లో ఇల్లు కట్టుకునే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని ఆమె చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు కొవిడ్ నియంత్రణ కోసం రాష్ట్రంలో సర్వే నిర్వహించి మెడికల్ కిట్లు అందజేసినట్లు గుర్తుచేశారు. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. వ్యాక్సిన్‌పై అపోహలు లేకుండా అందరూ టీకా వేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: షర్మిలకు చుక్కెదురు.. కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు..!