మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అప్పాజీపల్లి ప్రాథమికోన్నత పాఠశాల తెలుగు మీడియంలో కొనసాగుతుండగా 127 మంది విద్యార్థులు.. ఆరుగురు సిబ్బందితో ఏడో తరగతి వరకు పాఠశాల నడుస్తోంది.
ఈ పాఠశాల ఆవరణలో చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల కోతులు స్వైర విహారం చేస్తూ అందరిపై దాడులకు ఎగబడుతున్నాయని వాపోయారు. ఉదయం బడికి రావాలంటే భయం వేస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత ఉపాధ్యాయులు మమ్మల్ని ఇంటి వరకు తోడుగా వస్తారని విద్యార్థులు తెలిపారు.
'మూత్రశాలలకూ వెళ్లాలన్నా గుబులే'
పాఠశాల ఆవరణలో హరితహారం కార్యక్రమం కింద ఏటా 400 వరకు మొక్కలు నాటుతున్నామని వాటిని కోతులు నాశనం చేస్తున్నాయని వివరించారు. మూత్రశాలకు వెళ్లాలంటే విద్యార్థులు జంకుతున్నారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో వీటి బెడద మరీ ఎక్కువగా ఉంటుందని ఉపాధ్యాయులు వాపోయారు.
'చదువుకోవాలన్నా భయమే'
కోతుల బెడద వల్ల విద్యార్థులతో ఆటలు ఆడించట్లేదని.. ఉపాధ్యాయులు పాఠాలు సైతం బోధించట్లేదన్నారు. కోతులు ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తాయోనని విద్యార్థులు పాఠ్యాంశాలపైన శ్రద్ధ పెట్టలేక పోతున్నారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. భోజనంలో గుడ్లు పెట్టే రోజు మరీ ఇబ్బంది కలిగిస్తుంటాయని వంట మనుషులు తెలిపారు.
కిటికీలు, తలుపులు లేనందుకే కోతుల ఆగడాలు
రహదారిని ఆనుకుని ఉన్న పాఠశాల కాబట్టి కోతులు ఆకస్మికంగా గుంపులుగా రోడ్లపైకి వస్తున్నాయని ఉపాధ్యాయులు అన్నారు. పాఠశాలకు వేళ్లేటప్పుడు దాడి చేస్తాయనే భయానక వాతవారణం వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వీటి మూలంగా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయని విద్యార్థులు వాపోయారు. ముఖ్యంగా పాఠశాల గదులకు సరైన కిటికీలు, తలుపులు లేకపోవడం వల్ల కోతులు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి.
'కోతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి'
మధ్యాహ్న భోజన సమయంలో ఉపాధ్యాయులు పాఠశాల గదులకు తాళాలు వేసి కాపలా కాయాల్సిన పరిస్థితి. పిల్లలు ఉదయం పాఠశాలకు వచ్చిన నాటి నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు కోతుల వల్ల బిక్కుబిక్కుమంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చూడండి : దారుణం.. మద్యం మత్తులో యువకునిపై దాడి