పనుల్లో వేగం పెంచి వచ్చే నవంబర్‌లోపు మెదక్ సమీకృత కలెక్టరేట్ భవనం పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ బిల్డింగ్‌లో ఆర్ అండ్ బీ, పోలీస్ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో మంత్రి సమీక్షాసమావేశం నిర్వహించారు. నవంబర్ నాటికి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్‌ను పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు కూలీల సంఖ్య పెంచుకోవాలన్నారు.
"ఇక నుంచి వారానికోసారి నిర్మాణ పనులను కలెక్టర్ పర్యవేక్షించాలి. అసంపూర్తిగా ఉన్న జిల్లా పోలీసు కార్యాలయ నిర్మాణ పనులు పునఃప్రారంభానికి పోలీస్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ కార్యాలయం నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయన్న కారణంతో.. ఇదివరకు ఉన్న కాంట్రాక్టర్‌ను తీసేసి మళ్లీ షార్ట్ టెండర్ పిలవాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ సూచించిచారు. ఆ షార్ట్ టెండర్ నిర్వహించి ఏడెనిమిది నెలల్లో జిల్లా పోలీస్ కార్యాలయం నిర్మాణం కూడా పూర్తి చేయాలి." -హరీశ్‌రావు, మంత్రి
అంతకుముందు.. పీఎన్ఆర్ ఇండోర్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన సింథటిక్ బ్యాడ్మింటన్ కోర్టును మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. స్టేడియం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి కాసేపు బ్యాడ్నింటన్ ఆడారు. అనంతరం... నాలుగున్నర కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను, 2 కోట్లతో నిర్మించనున్న వైకుంఠధామానికి శంకుస్థాపన చేశారు. మెదక్‌లో 1,000 ఇళ్లు, నర్సాపూర్‌లో 800, తూప్రాన్‌లో 800, రామయంపేటలో 300 డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ హరీశ్‌కు సూచించారు.
జిల్లాలో కరోనా పూర్తిస్థాయిలో తగ్గిందని మంత్రి తెలిపారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించాలని హరీశ్‌రావు సూచించారు.
ఇదీ చూడండి: kaleshwaram: కాళేశ్వరం నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న నీటి ఎత్తిపోతలు