మున్సిపాలిటీల్లో ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు అభివృద్ది సాధించే విషయంలో మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ కలెక్టరేట్లో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలకు చెందిన మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీల అభివృద్ది విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన డంపు యార్డులలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేయడంతో పాటు ప్రతి రోజు వార్డులలోని ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించాలన్నారు. ఈ విషయంలో పట్టణ ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అవసరమైన మేరకు షీ–టాయిలెట్లు నిర్మించబోతున్నామని... దీనికి స్థలసేకరణ చేపట్టాలని మంత్రి సూచించారు. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో ఆగస్టు 15వ తేదీలోగా మంజీరా నీటిని అన్ని ఇళ్లకు అందించాలని మంత్రి ఆదేశించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో ఆదాయ వనరులు పెంపొందించుకునే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. దీనికి కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్ రావు వివరించారు. మున్సిపాలిటీల్లో సకాలంలో కరెంట్ బిల్లులు చెల్లించేలా చూడాలని మంత్రి కోరారు. మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో నీటి సరఫరాకు ఎన్ని ట్రాక్టర్ల ద్వారా ఎన్ని ట్యాంకర్లను వినియోగిస్తున్నారని అడిగి తెలుసుకొన్నారు. కొద్ది రోజుల్లో తెల్లరేషన్ కార్డులు ఉన్న వారికి రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని.. అక్రమంగా ఎవరైనా నల్లా కనెక్షన్ కలిగి ఉంటే వారికి జరిమానాలు విధించాలన్నారు.
ఇవీ చూడండి:కేంద్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణిని అవలంభిస్తోంది: మంత్రి ఎర్రబెల్లి