Minister Harish Rao Comments: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఆర్టీసీ డిపోను మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఏర్పాటు చేశారు. డిపోను మంత్రులు హరీశ్‌రావు, అజయ్ కుమార్ ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో నర్సాపూర్‌లో బస్ డిపో ఏర్పాటుపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని మంత్రి అజయ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం వల్ల తెలంగాణలో మొట్టమొదటి ఆర్టీసీ డిపో నర్సాపూర్‌కు వచ్చిందని పేర్కొన్నారు. డిపోకు కావల్సినన్ని బస్సులు కేటాయిస్తామని మంత్రి హమీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని.. వాటిని ఆదరించి సంస్థను కాపాడుకోవాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ప్రజాసంక్షేమం, శ్రేయస్సును విస్మరించి.. వ్యాపార ధోరణితో పరిపాలన చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేస్తోందని.. రైల్వేలు, రైల్వేస్టేషన్లు, విశాఖ ఉక్కు వంటి సంస్థలను అమ్మకానికి పెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ సంస్థలను అమ్మితే.. 2,000 కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్రం బహుమానం ప్రకటించిందన్నారు. డబుల్ ఇంజిన్ అభివృద్ధి చెప్పే భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణాలో అమలవుతున్న పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు.
"కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోంది. విభజ చట్టంలోని హమీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన కోచ్ ఫ్యాక్టరీని.. గుజరాత్‌కు తరలించారు. హైదరాబాద్‌లో పెడతామన్న గ్లోబల్ ట్రెడిషనల్ హెల్త్ సెంటర్‌ను కూడా గుజరాత్‌కు తీసుకుపోయారు. ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు.. నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోంది." -హరీశ్ రావు, మంత్రి
ఇవీ చదవండి: