మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 9 నుంచి 14 వరకు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లిలోని ఏడుపాయల వన దుర్గా భవాని ఉత్సవాలు జరగనున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని మంత్రి తన్నీర్ హరీశ్ రావు.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు.
ఐపీ దర్శనం ఉండదు
ఏటా భవాని మాతను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారని హరీశ్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం నీరు పుష్కలంగా ఉన్నందున 8 నుంచి 10 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశాముందని అభిప్రాయపడ్డారు. అందుకనుగుణంగా అధికారులు తమకు అప్పగించిన పనులను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా జాగరణ, 12న ఎద్దుల బండ్లు తిరగటం, 13న అమ్మవారి రథోత్సవం ఉంటుందని వివరించారు. భక్తులకు సర్వదర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం ఉంటుందని, వీఐపీ దర్శనం ఉండదని చెప్పారు.
చండీ యాగం, యజ్ఞం
ఎంతో మహిమ ఉన్న వనదుర్గా భవాని ఆలయ ప్రాంగణంలో చండీ యాగం, యజ్ఞం చేస్తున్నందున విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న నాలుగు షెడ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. తద్వారా ఎంతో మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడంతో పాటు దేవస్థానానికి ఆదాయం సమకూరుతుందని దేవాలయ కార్యనిర్వహణాధికారి సార శ్రీనివాస్‌కు సూచించారు. జాతరకు కొల్చారం, నాగసాన్‌పల్లి దారుల నుంచి ప్రజలు వచ్చే అవకాశమున్నందున ప్రస్తుతం దేవాలయ ప్రాంగణంలో ఉన్న 42 సీసీ కెమెరాలతో పాటు.. పారిశ్రామికవేత్తల నుంచి సీయస్ఆర్ నిధులు సేకరించి అదనంగా మరో 50 కెమెరాలను కొనుగోలు చేయాలన్నారు. ఈ రెండు రహదారుల ప్రాంతాల్లో ఏర్పాటు చేయవలసిందిగా పరిశ్రమల కేంద్రం జిల్లా అధికారిని మంత్రి ఆదేశించారు. దేవాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న వంద ఫీట్ల రోడ్డును త్వరగా పూర్తి చేయవలసిందిగా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.
సంబంధిత అధికారులకు ఆదేశాలు
భక్తులు స్నానమాచరించేందుకు సింగూర్ ద్వారా నీటిని విడుదల చేయాలని.. ఆ ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను హరీశ్ రావు ఆదేశించారు. వంద మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్య శాఖ సహాయ సంచాలకులను, చెక్ డ్యాం చుట్టూ బారికేడింగ్, దర్శన క్యూ లైన్, వాహనాల పార్కింగ్‌కు బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్అండ్‌బీ అధికారులకు సూచించారు. అలాగే తాగునీటి ఏర్పాట్లు, మరుగుదొడ్ల నిర్మాణాలు చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందితో దేవాలయ ప్రాంగణం శుభ్రంగా ఉండేలా చూడాలని, అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు.
ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి
భక్తులకు అత్యవసర చికిత్స కోసం ఐదు ప్రథమ చికిత్స వైద్య శిబిరాలు, మూడు అంబులెన్సులు ఏర్పాటు చేయాలని.. అంటు వ్యాధులు ప్రబలకుండా ఫాగింగ్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని హరీశ్ రావు ఆదేశించారు. బస్టాండు నుంచి దేవస్థానం వరకు ఐదు ఉచిత షటిల్ సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులకు చెప్పారు. అగ్నిప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖ సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజల మన్ననలు పొందేలా పోలీసు సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ చందన దీప్తికి సూచించారు.
ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, కలెక్టర్ హరీశ్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ రావు, సహాయ కమిషనర్ కృష్ణ, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వారు దిల్లీలో గులాంగిరి చేస్తారు: హరీశ్ రావు