గోదావరి జలాలతో హల్దీ ప్రాజెక్టు మత్తడి దూకడం ఒక అద్భుత సన్నివేశమని మంత్రి హరీశ్ హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హల్దీ ప్రాజెక్టు వద్ద గంగమ్మకు మంత్రి పూజలు నిర్వహించారు. నదులు లేని చోట ప్రాజెక్టులు కట్టి... నీరు వదులుతూ... జీవనదులుగా మార్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని హరీశ్‌రావు తెలిపారు. హల్దీలోకి నీళ్లు రావడం వల్ల నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.
గత పాలకుల మాటలు మాత్రమే చెప్తే... తెరాస ప్రభుత్వం చేతలు చేసి చూపించిందన్నారు. కాళేశ్వరం నీళ్లతో రైతుల పాదాలు కడిగిన ఘనత కేవలం సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కరువు కాటకాలతో ఉన్న మెదక్ జిల్లా... హల్దీ వాగులోకి నీళ్లు రావటం వల్ల రాబోయేకాలంలో ఆయిల్ పామ్ తోటలకు అనుకూలంగా మారుతుందని వివరించారు.