కరోనా వైరస్ స్ట్రెయిన్ పట్ల ఉమ్మడి మెదక్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో బ్రిటన్ నుంచి వచ్చినవారి సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 27 మందిని గుర్తించి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. సిద్దిపేటకు బ్రిటన్ నుంచి వచ్చిన ముగ్గురిలో ఒకరికి పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇది సాధారణ కరోనానా...? లేక కొత్త రకమా అనే అంశాన్ని నిర్ధరించుకోవడం కోసం మరోసారి నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపించారు. ఫలితాలు రావడానికి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని.. ఆ తర్వాతే తదుపరి కార్యాచరణ ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు. బ్రిటన్ నుంచి వచ్చినవారు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
డిసెంబర్ 12 తేదీ నుంచి ఇప్పటి వరకు 24 మంది బ్రిటన్ నుంచి సంగారెడ్డి జిల్లాకు వచ్చారు. వీరిలో అత్యధికంగా జహీరాబాద్‌కు చెందిన వారు 10 మంది ఉన్నారు. కొండాపూర్, పటాన్చెరు మండలాల్లో నలుగురు, రామచంద్రాపురం మండల పరిధిలో ముగ్గురు, సదాశివపేట, అమీన్పూర్, జిన్నారం మండలాల పరిధిలో ఒకరు చొప్పున ఉన్నారు. వీరిలో 24 మందికి పరీక్షలు నిర్వహించగా.. 17 మంది ఫలితాలొచ్చాయి. అందరికీ నెగిటివ్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచే కాకుండా ఇతర విమానాశ్రయాల ద్వారా వచ్చిన వారి సమాచారాన్ని సంగారెడ్డి అధికారులు సేకరిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 9 మందిని గుర్తించారు.
ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతిని కలిసిన భారత్ బయోటెక్ సీఎండీ, జేఎండీ