రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు, మిల్లర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించినప్పటి నుంచి రైతు ఖాతాలో డబ్బు జమయ్యే వరకు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిన్న చిన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో.. ధాన్యాన్ని మూడు, నాలుగు రోజుల్లోగా మిల్లులకు తరలించాలని కలెక్టర్ చెప్పారు. రైస్ మిల్లుల యజమానులు అధిక సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకుని లారీలు ఖాళీ చేసేలా చూడాలని సూచించారు.
రైతులకు ఇబ్బంది కలగకుండా తహసీల్దార్లు మానిటరింగ్ చేయాలని, నేటి నుంచి ప్రతి రెండు గంటలకు ఒకసారి లారీల తాజా స్థితి వివరాలు తనకు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు.