రూర్బన్ పథకం కింద మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆ జిల్లా కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికపరమైన కార్యక్రమాలు చేపట్టి... సమగ్ర అభివృద్ధితో పాటు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు పైలట్ ప్రాజెక్ట్‌గా పాపన్నపేట మండలాన్ని ఎంపిక చేసి ఇప్పటి వరకు రూ.30 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. 435 పనులను గుర్తించి రూ.12 కోట్లతో 256 పనులు పూర్తి చేశామని, 115 పనులు పురోగతిలో ఉన్నాయని, మరో 64 పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలోని కలెక్టరేట్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
త్వరలో ఏర్పాటు
రూర్బన్ పథకం కింద పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, శౌచాలయాలు, సైన్సు ల్యాబ్, పశు సంవర్ధక, గ్రామ పంచాయతీ, అంగన్వాడి, వైద్య ఉప కేంద్ర భవనాలు, వైకుంఠధామాలు, నీటి సరఫరా, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. జ్యూట్ బ్యాగుల తయారీ, మీల్స్ ప్లేట్, బేకరీ యూనిట్లు నెలకొల్పడం, మిల్లట్స్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, పాల శీతలీకరణ కేంద్రం వంటి యూనిట్లు అతి త్వరలో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమన్వయం అవసరం
జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కోరారు. గ్రామాల్లో జరిగే వివిధ పనుల వివరాలను తెలియజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్, పంచాయతీరాజ్ ఈఈ రామచంద్ర రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్ కుమార్, పాపన్నపేట మండల ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సకల రుచుల యందు.. దాని రుచే వేరయా..!