ఇప్పటి వరకు విదేశాలనుంచి జిల్లాకు వచ్చిన 111 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచామని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. వారెవరిలో కరోనా లక్షణాలు లేవని... ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి బయట తిరిగిన నిజాంపేట వాసులిద్దర్నీ అరెస్టు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా నిర్బంధ కేంద్రానికి తరలించామని తెలిపారు.
ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని కోరారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని రకాల దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు. రాత్రి 7నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని... ఆ సమయంలో బయటకు తిరగడానికి అనుమతి లేదని తెలిపారు. నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి 12కిలోల రేషన్ బియ్యం పంపిణీ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో కరోనాపై నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ నాగరాజు, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, డీఎస్పీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వసతి గృహాల్లోని వారిని ఖాళీ చేయిస్తే కఠిన చర్యలు: డీజీపీ