మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల్ కొనుగోలు కేంద్రంలో తప్పుడు తూకంతో మోసం అంశంపై అదనపు కలెక్టర్ జి.రమేష్.. జిల్లా సహకార అధికారి కరుణను విచారణకు ఆదేశించారు. కాట్రియాల్ కొనుగోలు కేంద్రానికి వెళ్లి విచారణ చేయగా... ఎలక్ట్రానిక్ యంత్రానికి బదులుగా కాంటాలను వాడుతూ తూకంలో అవకతవకలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని కరుణ తెలిపారు. ఎలక్ట్రానిక్ యంత్రం ద్వారా తూకం ఎందుకు వేయలేదని సంబంధిత హమాలీ నాయకుడిని అడగగా.. రామాయంపేట పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీశైలం రెడ్డి మాట ప్రకారమే తూకం వేసినట్లు తెలిపాడని కరుణ పేర్కొన్నారు.
అవకతవకలకు పాల్పడిన కేంద్రం ఇన్ఛార్జీని వెంటనే తొలగించడంతో పాటు తెలంగాణా సహకార చట్టం ప్రకారం శ్రీశైలం రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ బాదే చంద్రంను ఆదేశించామని అదనపు కలెక్టర్ రమేష్ తెలిపారు. శ్రీశైలం రెడ్డితో పాటు ఇందుకు బాధ్యులైన వారి నుంచి డబ్బులు రికవరీ చేసి ట్రక్ షీట్ ఆధారంగా నష్టపోయిన రైతులకు ధాన్యం విలువ డబ్బులను వారి ఖాతాలలో జమ చేయవలసిందిగా రామాయంపేట చైర్మన్‌ను ఆదేశించారు.
ఇదీ చదవండి : రెండు రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలు