మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజల్... సీతారామ ఆలయ భూముల ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ సహా మరికొందరు ఆ భూములను ఆక్రమించుకుంటున్నట్లు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా విచారణకు ఆదేశించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వెల్లడించారు. ఇందుకోసం నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు.
వెయ్యి కోట్లకుపైగా ఆస్తులు..
ఆ ఆలయానికి వెయ్యి కోట్లకుపైగా విలువైన 1,521 ఎకరాల 13 గుంటలు భూమి ఉండగా... అదంతా ఆక్రమణదారుల కబంద హస్తాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ భూముల్లో... ఏ అనుమతి లేకుండా చట్టవ్యతిరేకంగా కట్టడాలు వెలిసినట్లు వివరించారు. ఎన్నో చట్టాలున్నా భారీగా ఉల్లంఘనలు జరగడంతో ఆలయ భక్తులు, దాతల మనోభావాలు దెబ్బతిన్నట్లు తెలిపారు.
ఎవరు ఆక్రమించారు..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ప్రతినిధిగా...పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్‌రావు వ్యవహరిస్తారు. నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మంచిర్యాల కలెక్టర్ భారతి హోళికేరి, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ శ్వేత మహంతి సభ్యులుగా ఉంటారని సీఎస్ వెల్లడించారు. ఆ భూమిని ఎవరు ఆక్రమించారు... ఆక్రమణలకు గురైన భూమి ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది.. ఆక్రమణదారుల వద్ద ఎలాంటి పత్రాలున్నాయి... ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయా.. ఎంతభూమి ఆక్రమణలకు గురైంది... తెరవెనుక పలుకుబడి కలిగిన వారుండి బినామీ పేర్లతో ఎంత భూమి ఉంది. ఆ భూమి ఆక్రమణల వల్ల ఆ ఆలయం ఎంతమేర నష్టపోయింది.... ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలతో కూడిన నివేదికను వీలైనంత త్వరగా ఇవ్వాలని కమిటీని సోమేశ్‌కుమార్ ఆదేశించారు.
భూముల ఆక్రమణకు సంబంధించి మెదక్ జిల్లా అచ్చంపేటలో విజిలెన్స్ విచారణ చేపట్టింది. అచ్చంపేట, హకీంపేట పంచాయతీ కార్యదర్శిని విచారించిన అధికారులు సర్వేయర్, ఎంపీడీవో నుంచి వివరాలు సేకరించారు.
ఇవీచూడండి: