ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నమ్మి సన్నరకం పంటలను సాగు చేసి పూర్తిగా నష్టపోయామని మెదక్ రామాయంపేట ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేశారు. సన్నాలకు ప్రభుత్వం రూ.2,500/- గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి రెండు గంటలపాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
కేసీఆర్ రైతులకు సన్న రకం వరి పంట సాగు చేయాలని చెప్పి.. ఆయన మాత్రం తన 40ఎకరాలలో దొడ్డు రకం వరి ధాన్యాన్ని పండించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులను నట్టేట ముంచిన ఘనత తెరాసదేనని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని నూర్పిడి చేసి కొనుగోలు కేంద్రాలకు తరలించి నెల రోజులు అవుతున్నా ఇప్పటివరకు మద్దతు ధర ప్రకటించకపోవడం ఎంత వరకు సమంజసమని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
సన్నరకం పంటకు వివిధ రకాల తెగులు సోకి పూర్తిస్థాయిలో నష్టపోయామని ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్నదాతలను ఆదుకోకపోతే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ఆందోళన