ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం నుంచి ఆగకుండా వర్షం కురుస్తోంది. కొన్నిచోట్ల భారీవర్షం కురవగా.. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. రాత్రంతా ఉరుములు, మెరుపులతో పాటు కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద రాత్రి కురిసిన వర్షానికి రైల్వే వంతెన కింద వర్షపు నీరు చేరి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు మోటార్ల సహాయంతో నీటిని తొలగించి వాహనాల రాకపోకలకు అంతరాయం తొలగించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మండలం కంజీపూర్ వద్ద వరద ప్రవాహనికి వంతెన కోతకు గురి కాగా.. రాకపోకలు నిలిచిపోయాయి. సింగూర్ ప్రాజెక్టులోకి 12,300 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.9టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 21.4 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది.