మలి వయసులో ఎంతకూ తగ్గని ధీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వృద్ధులకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక, ఆదుకునే వారు కానరాక ఆసుపత్రులకు వెళ్లలేని వృద్ధులను దృష్టిలో ఉంచుకుని ‘ఆలన’ కార్యక్రమం రూపొందించారు.
వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం..
ఇంటి వద్దకు వచ్చి అక్కడే పరీక్షించి అవసరమైన మందులను అందజేయడం ‘ఆలన’ కార్యక్రమం ప్రధాన విధి. ఆలన వాహనంలో వైద్యుడు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు ఉండి, తమ వద్ద ఉన్న ఇంతకు ముందే సేకరించిన సమాచారం మేరకు వైద్య సేవలు అందించనున్నారు.
ప్రత్యేక ప్రణాళికతో విధులు..
మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ఈ వాహన సేవలు అందేలా ప్రణాళికలు రూపొందించినట్లు వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మంచానికి పరిమితమైన వారు క్యాన్సర్, పక్షవాతం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు ఈసేవలు అందించనున్నట్లు వెల్లడించారు.
ప్రతి గ్రామంలో సేవలు..
మలి వయసులో ఉన్నవారు దీనిని వినియోగించుకోవాలని కోరారు. ఈ వాహనంపై ప్రతి గ్రామంలో అవగాహన క్యార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం ద్వారా ఒక లక్ష 16 వేల మంది లబ్ధి పొందినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు