డబ్బు విలువ తెలిస్తేనే పొదుపు చేయడం అలవాటవుతుంది. అప్పుడే రుణాలు చెల్లించే సమయంలో నిక్కచ్చిగా ఉంటారు. ఈ దిశగా నడిపించడమే లక్ష్యంగా పేదరిక నిర్మూలన సంస్థ మహిళా సంఘాల్లో చైతన్యం తీసుకొస్తోంది. ఆరు నెలల తర్వాత బ్యాంకు రుణం మొదటి సారిగా మంజూరుకాగానే సంఘం సభ్యులు సమావేశం ఏర్పాటుచేసుకుని ఎవరికి అత్యవసరం అని చర్చించి తగు నిర్ణయం తీసుకునేలా ప్రోత్సహిస్తోంది. తీర్మానం చేసి అంతర్గతంగా రుణాలు ఇప్పిస్తోంది. కొంత వడ్డీని కూడా నిర్ణయించేలా వారికి మార్గనిర్దేశం చేస్తోంది.
సంగారెడ్డి జిల్లాలో పేదిరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహిళలకు దిశానిర్దేశం చేస్తూ పొదుపు దిశగా అడుగేయిస్తోంది. వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలను మంజూరు చేస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తోంది. వికారాబాద్ జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉన్నాయి. ఇక్కడి డ్వాక్రా సంఘాల సభ్యులు తమ చిరువ్యాపారాల నిర్వహణకు తీసుకున్న రుణాలను వెచ్చిస్తున్నారు.
తక్కువ సంపాదించే వారి కన్నా తక్కువ పొదుపు చేసే వారికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.
- గాంధీజీ
నీటి చుక్కను ఒడిసిపడితే భవిష్యత్తుకు మేలు చేస్తుంది.. ధనాన్ని దాచిపెట్టుకుంటే రేపటి తరానికి, ఆపత్కాలంలో పనికొస్తుంది.. అదే పొదుపుగా మాట్లాడితే అందరూ మిత్రులే అవుతారు.. ఇంతకన్నా పొదుపు గురించి చెప్పేది ఏముంటుంది.. పొదుపుతోనే భవిత అన్నది జగమెరిగిన సత్యం. దీన్ని విస్మరిస్తే అధోగతే. ఖర్చులను తగ్గించుకుని భవిష్యత్తు అవసరాలకు మిగుల్చుకోవడం ముఖ్యం. ప్రస్తుతం అందరినీ భయపెట్టిస్తున్న ‘కరోనా’ విజృంభణ పొదుపు ఎంత అవసరమో చాటిచెప్పింది. ఇక ఈ మాట వినగానే మహిళలే గుర్తుకొస్తారు. పురుషులు సైతం ఇదే బాటలో ముందుకు సాగుతుండటం విశేషం.
పొదుపు చేసిన మొత్తం: 23.04 కోట్లు
పురుష పొదుపు సంఘాలు: 46
సభ్యులు: 16,241
స్వయం ఉపాధి పొందుతూ..
నంగునూరు మండలం సిద్దన్నపేట గ్రామానికి చెందిన రాధాకిషన్ 2005లో పురుషుల పొదుపు సంఘంలో సభ్యత్వం తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెలా రూ.100 చొప్పున పొదుపు చేస్తున్నారు. స్వయం ఉపాధి నిమిత్తం ఎనిమిది నెలల క్రితం నియమిత అప్పు, అభయనిధి, ప్రత్యేక అప్పు, బోనస్ కింద సంఘం నుంచి రూ.లక్ష రుణంగా పొంది స్వగ్రామంలోనే కిరాణా దుకాణం పెట్టుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. వ్యాపారం సాఫీగా సాగడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెలా రూ.3 వేల చొప్పున అప్పు చెల్లిస్తున్నారు. పొదుపు చేయడంతోనే ఆర్థిక పురోగతి సాధ్యమైందంటారు రాధాకిషన్.
కుటుంబానికి చేదోడువాదోడుగా..
పొదుపు సంఘంలో తీసుకున్న రుణాన్ని వినియోగించుకొని కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచారు గుమ్మడిదల మండలం అనంతారం గ్రామానికి చెందిన అనురాధ. గ్రామంలోని బిందులత స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా చేరాక ఆమె పరిస్థితి మారిపోయింది. పొదుపు బాట పట్డటంతో స్త్రీనిధి, బ్యాంకు, పొదుపు ద్వారా రూ.1.50 లక్షల వరకు రుణం తీసుకున్నారు. తొలి విడతలో పాడిగెదేలను కొనుగోలు చేశారు. వాటి పాలను అమ్మగా వచ్చిన డబ్బు పొదుపు చేశారు. ఆరు నెలల తర్వాత మరో రెండింటిని కొనుగోలు చేశారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు కుమారుడిని డిగ్రీ చదివించింది. కుమార్తెకు వివాహం సైతం చేశారు. ఇదంతా పొదుపుతోనే సాధ్యమైందని చెబుతారు.
సిద్దిపేట జిల్లాలో ప్రత్యేకంగా పురుషులు ప్రత్యేకంగా పొదుపు సంఘాలను ఏర్పాటుచేసి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కృషి చేస్తున్నారు. ఓ వైపు పొదుపు చేపడుతూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా జిల్లాలో సిద్దిపేట, నంగునూరు, కోహెడ, హుస్నాబాద్ వంటి ప్రాంతాల్లో ఇవి పని చేస్తున్నాయి.