మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయిలో రైతులు ఆందోళన చేపట్టారు. సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం రూ. 2500 గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామ సహకార సంఘం కార్యాలయం గేటుకు తాళం వేశారు. కార్యాలయం ఆవరణలో సీఈఓ బాలకిష్టయ్య, అటెండర్ కుమార్ను నిర్బంధించారు. సన్నరకం ధాన్యానికి నిప్పుపెట్టి నిరసన తెలిపారు.
గ్రామగ్రామానికి వ్యవసాయ అధికారులను పంపించి సన్నరకం పంట వేయాలని ప్రచారం చేయించారని అన్నదాతలు చెప్పారు. వారి మాట నమ్మి సన్నరకం సాగు చేస్తే మద్దతు ధర కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడకపోవడం ఏంటని ప్రశ్నించారు.
సన్నరకం వరి వేయడం ద్వారా వివిధ రకాల చీడపీడలు ఆశించాయన్నారు. అనేక రసాయనాలను పిచికారి చేయడానికి ఎకరానికి 6 వేల రూపాయలు అదనంగా ఖర్చు చేశామని రైతులు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ. 2500కు సన్నరకం వడ్లను కొనుగోలు చేయాలన్నారు. మద్దతు ధర కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు.
ఇదీ చదవండి: ధరణి పోర్టల్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలపై కేసీఆర్ కీలక సమీక్ష