మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని రామాయంపేట-గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు, భాజపా కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. సన్నరకం వరిధాన్యానికి రూ.2500 గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సన్నరకం వరి పంట సాగు చేయాలని చెప్పి తాను మాత్రం దొడ్డురకం వరి ధాన్యాన్ని పండించడం ఎంత వరకు సమంజసం అంటూ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సన్నరకం పంటకు వివిధ రకాల తెగుళ్లు ఆశించి పూర్తిస్థాయిలో నష్టపోయామని.. ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటకు కూడా నష్టపరిహారం అడగలేదని.. సన్నరకానికి కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. లేకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: టోకెన్లకోసం కార్యాలయాల వద్ద రోజుల తరబడి పడిగాపులు