కాళేశ్వరం కాలువలో భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని... లేకపోతే కుటుంబసభ్యులందరం ఆత్మహత్య చేసుకుంటామని మెదక్ జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం హెచ్చరించింది. చిలప్‌చెడ్ మండలం ఫైజాబాద్‌లోని కొత్తకుంటతండా భూముల గుండా కాళేశ్వరం కాలువ వెళ్తోంది. ఒకే కుటుంబానికి చెందిన 11.35 ఎకరాల భూమిని కాలువలో పోతోంది. కాలువ ఒకవైపు నుంచి వెళితే... తమకు కనీసం రెండు ఎకరాలు అయినా మిగులుతుందని రైతు కుటుంబం తెలిపారు.
అధికారులు సర్వే చేయడానికి వెళ్లగా... తాము ఆత్మహత్య చేసుకుంటామని పెట్రోలు, పురుగుమందుల డబ్బాలు పట్టకుని రైతు కుటుంబసభ్యులు అడ్డుగా నిల్చున్నారు. అధికారులు చేసేదేమీలేక వెనుదిరిగారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ సత్తార్, ఎస్సై మల్లారెడ్డితో కలసి అక్కడికి చేరుకుని కుటుంబసభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. భూమి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం చేస్తామని తహసీల్దార్ సత్తార్ తెలిపారు.