Diwali Festival Accidents in Telangana : 2021లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్తను పోగొట్టుకున్న మహిళ.. తన ఇద్దరి కవల పిల్లలే సర్వస్వంగా జీవితం గడుపుతోంది. ఇంతలోనే దీపావళి పండుగ(Diwali Festival 2023) రావడంతో పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై బాణాసంచా(Fire Crackers) కొనేందుకు వెళ్లగా.. వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే తన ఇద్దరు కుమారులు మృతి(Two childrens Died) చెందడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ విషాదకర ఘటన ఆదివారం మెదక్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండలం కాదలూర్కు చెందిన బేగరి రాములుకు ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు శ్రీనివాస్‌కు అన్నపూర్ణతో వివాహం జరిగింది. వీరికి కవల పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ మెదక్ డీఎస్పీ వద్ద హోంగార్డుగా పని చేయగా.. అన్నపూర్ణ మెదక్‌లోని కస్తూర్బా పాఠశాలలో 2018 నుంచి ఒప్పంద పద్ధతిలో జీవశాస్త్రం బోధకురాలిగా ఉద్యోగం చేస్తున్నారు. 2021లో సంగారెడ్డి జిల్లా అన్నాసాగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త శ్రీనివాస్ మరణించాడు. అప్పటి నుంచి అన్నపూర్ణే తన ఇద్దరి పిల్లల బాధ్యతను చూసుకుంటుంది. మెదక్‌లోని జంబికుంటలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ పిల్లలను చదివించుకుంటుంది. ఒకరు తూప్రాన్‌లోని ప్రైవేటు పాఠశాల హాస్టల్లో చదవగా, మరొకరు స్థానికంగా ఉండే స్కూల్లో చదువుతున్నారు.
Two Children Died in Road Accident : ఇంతలోనే ఆదివారం దీపావళి రావడంతో కుమారులు ఇద్దరిని తీసుకొని బాణాసంచా కొనిచ్చేందుకు అన్నపూర్ణ ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఈ క్రమంలో ఆటోనగర్ వద్దకు రాగానే వెనక నుంచి టిప్పర్ వచ్చి ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయారు. కుడివైపు ఇద్దరు పిల్లలు, ఎడమవైపు ఆమె పడ్డారు. దీంతో ఆ కవల పిల్లల తలలపై నుంచి టిప్పర్ వెళ్లగా.. తలలు నుజ్జునుజ్జయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఎడమవైపు పడిన ఆమె ప్రాణాలను దక్కించుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పిల్లల మరణం చూసిన తల్లి కోమాలోకి వెళ్లిపోయారు. రెండేళ్ల క్రితం భర్తను ఇదే రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకున్న ఆమె.. ఇప్పుడు తన ఇద్దరి పిల్లలు అదే రీతిలో మరణించడంతో దిక్కు తోచని స్థితిలో మిగిలిపోయింది. మెదక్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం సోమవారం సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం : మరో ఘటనలో పేట్ బషీరాబాద్‌లో టపాసుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రీషియన్ మహేశ్ దుర్మరణం చెందాడు. అతనికి తెలిసిన వారు బోయిన్‌పల్లిలో బాణాసంచా దుకాణం ఏర్పాటు చేయగా.. టపాసులు కొనడానికి ఆదివారం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళితే.. వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
దీపాలు వెలిగిస్తూ చీరకు అంటుకున్న నిప్పు : మరోవైపు హైదరాబాద్‌లోని ప్రేంవిజయ్‌నగర్ కాలనీలో వెంకటేశ్వర అపార్ట్మెంట్లో దీపావళి రోజు బాల్కనీలో ప్రమిదలు వెలిగిస్తూ.. వృద్ధ దంపతులు అగ్నికి ఆహుతయ్యారు. ఆ అపార్టుమెంటులో విశ్రాంత ఉపాధ్యాయ దంపతులు రాఘవమ్మ, రాఘవరావు నివసిస్తున్నారు. వారి పిల్లలు లేకపోవడంతో సమీప బంధువులున్న అపార్టుమెంటులోనే ప్లాట్ కొనుక్కోని ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం రాఘవమ్మ బాల్కనీలో ప్రమిదలు ముట్టిస్తుండగా.. ఆమె చీరకు నిప్పంటుకుంది. భయంతో పక్కనే ఉన్న రూంలోకి పరుగు తీయగా.. అక్కడే అనారోగ్యంతో మంచం మీద ఉన్న భర్తకు నిప్పు అంటుకుంది. ఆయన తేరుకునే లోపే ఒళ్లంతా వ్యాపించి అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె ప్లాట్ నుంచి మంటలతో బయటకు రావడంతో ఇరుగుపొరుగు వారు ఆమంటలు ఆర్పి.. 108కు కాల్ చేశారు. ఆమె కూడా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు.